తిమడాం హెచ్‌ఎంపై విచారణ
జలుమూరు: మండలంలోని తిమడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బి.కృష్ణారావుపై పూర్తిస్థాయి విచారణ చేసి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక అందచేయనున్నట్లు డిప్యూటీ డీఈవో ఆర్.విజయ కుమారి తెలియజేశారు. ఈ మేరకు పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దల సమక్షంలో బుధవారం విచారణ చేపట్టారు. ఇటీవల హెచ్‌ఎంపై గ్రామస్తులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా పాఠశాల ఆవరణలో ఉన్న టేకుచెట్లు నరికివేసి, వాటి కలపను తన సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. అలాగే మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వివరించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులతో పాఠశాల గుడ్లను వండించుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు, లేఖలు తీసుకొని ఉన్నతాధికారులకు నివేదించనున్నామని డిప్యూటీ డీఈవో తెలియజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు వెలమల మురళీ, అసిరానాయుడు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment