వివాహిత ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు
నరసన్నపేట: స్థానిక శ్రీనివాసనగర్‌లో వివాహిత ఆత్మహత్య కేసులో ఆమె భర్త అంధవరపు మధుసూదనరావును నరసన్నపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా సివిల్ జడ్జి హరిప్రియ 14 రోజుల రిమాండ్ విధించారని నరసన్నపేట ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
కుమారుడికి
తలకొరివి పెట్టిన తల్లి
ఇచ్చాపురం : పట్టణంలోని చక్రపాణి వీధికి చెందిన లక్ష్మిరెడ్డి రాజు(33) అనారోగ్యంతో బుధవారం మృతిచెందాడు. ఈయనకు తల్లి రమ, భార్య రోజా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవడంతో గురువారం తల్లి రమ కుమారుడికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది.
గాయపడిన ఇంజినీరింగ్
అసిస్టెంట్ మృతి
నందిగాం: మండలంలో ని పెద్దలవునిపల్లి జాతీ య రహదారిపై ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయా లపాలైన కాపుతెంబూరు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ తుంగాన చైతన్య(32) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న నందిగాం ఎంపీడీఓ ఆఫీసులో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై అధికారులు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన చైతన్య తిరిగి ద్విచక్రవాహనంపై తన స్వగ్రామమైన పాత్రునివలస వెళుతుండగా పెద్దలవునిపల్లి సమీపంలో కుక్క అడ్డుగా రావడంతో బైక్ అదుపుతప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి లో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. చైతన్య కు భార్య అమృత, మూడేళ్ల కుమార్తె హశ్రిత ఉన్నారు. అమృత పలాస మండలం బంటుకొత్తూరు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. చైతన్య తండ్రి కేశవుడు కొత్తగ్రహారం ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాగా తల్లి కృష్ణవేణి గృహిణి. భార్య అమృత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెట్ల నరికివేతపై గోప్యత
ఎందుకో?
జలుమూరు: తిమడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న టేకుచెట్లను హెచ్‌ఎం నరికివేసి సొంతానికి వాడుకున్న ఘటనలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఏడెనిమిది నెలల కిందట మిషన్‌తో టేకుచెట్లు నరికి తరలించినా ఇంత వరకూ విషయం బయటకు రాకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, పేరెంట్స్ కమిటీ, మిడ్డేమీల్స్ నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏ ఒక్కరు కూడా హెచ్‌ఎంను ప్రశ్నించకపోవడంలో ఆంతర్యం ఏంటన్నది తెలియడం లేదు. బాలికల మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటం, మిడ్డేమీల్స్ నాణ్యత లేకపోవడం, చెట్లు మాయం, విద్యార్థుల టీసీల కోసం డబ్బులు వసూలు చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తోపాటు రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంత జరిగినా మండల విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment