ప్రేమ వ్యవహారమే కారణం: డీఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవీణ్‌కుమార్ నాయక్ ఘటన కలకలం రేపింది. అయితే ప్రేమ వ్యవహారం కారణంగా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని డీఎస్పీ సీహెచ్ వివేకానంద స్పష్టం చేశారు. ఈ మేరకు గూనపాలెంలోని సబ్‌డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ప్రవీణ్ ఉండే రూమ్‌లో ఓ అబ్బాయి బయటకువెళ్లి రాకపోవడంతో తలుపులు తీసి ఉంచారని, అప్పటికే మిగతావారితో కలిసి పడుకుని ఉన్న ప్రవీణ్ రాత్రి 1:30 సమయంలో లేచి తలుపు తోసుకుని బయటకు వెళ్లినట్లు విద్యార్థులు చెప్పారన్నారు. అక్కడికి కొద్ది క్షణాల్లోనే మూడో అంతస్తు కిటికీ నుంచి ప్రవీణ్‌నాయక్ దూకేశాడని తెలిపారు. విద్యార్థులు, కేర్ టేకర్లు కలిసి విద్యార్థిని రిమ్స్‌కు తీసుకెళ్లారని, కానీ బ్లీడింగ్ ఎక్కువగా కావడంతో 2.30కు ప్రాణాలు విడిచాడని వైద్యులు ధ్రువీకరించారన్నారు.
ప్రేమించే సమయం ఇది కాదన్నందుకే..
విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్‌ఐ జె.ఆర్.పురం సీఐ అవతారం దృష్టికి రాత్రి సమయంలోనే ఫోన్ చేసి చెప్పడంతో రిమ్స్‌కు, ఘటనాస్థలికి చేరుకున్నారు. సీఐ విచారణ చేయగా.. ప్రవీణ్‌నాయక్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలిసిందని డీఎస్పీ తెలిపారు. ఆమె ఇది ప్రేమించే సమయం కాదు.. చదువుకుందామని చెప్పడంతో దీన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. మృతుని సెల్, ల్యాప్‌టాప్‌లను పరిశీలించాల్సి ఉందన్నారు. విజయవాడలో ఉన్న ఎస్పీ మహేశ్వర రెడ్డి ఫోన్ చేసి మానిటరింగ్ చేయడంతో వారి తల్లిదండ్రులను పిలిపించామని, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల వద్ద స్టేట్‌మెంట్లు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీతో పాటు సీఐ అవతారం, ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ హరికృష్ణ ఉన్నారు. విద్యార్థి మృతిపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ ౖచైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు నివేదిక కోరుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేయాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment