పట్టపగలే ఆలయంలో చోరీ
రణస్థలం: మండలంలోని కొచ్చెర్ల పంచాయతీ పాత సుందరపాలెం సమీపంలో ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ నిర్వాహకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయానికి వచ్చి పూజారి నిడుగుంట వెంకట రమణమూర్తిని కలిశారు. ముహూర్తాలు చూడాలని అడిగారు. ఆలయం పక్కనే ఉన్న ఇంటి ఆవరణలో పూజారి ముహూర్తాలు చూస్తుండగా ముగ్గురిలో ఒకరు అక్కడే ఉండగా.. మిగతా ఇద్దరు ఆలయంలోనికి వెళ్లి చోరీకి పాల్పడ్డారు. పూజారి సాయంత్రం వేళ ఆలయంలో ధూపదీప నైవేద్యాలు పెట్టేందుకు వెళ్లగా అమ్మవారి వెండి కిరీటాలు, వడ్డానం వంటి ఆభరణాలు కనిపించలేదు. కొద్దిసేపటి కింద ముహూర్తాల కోసం వచ్చిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని భావించి జె.ఆర్.పురం పోలీసులకు సమాచారం అందించారు. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment