
30 ఎకరాల గడ్డివాములు దగ్ధం
నరసన్నపేట: మండలంలోని తోటాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెద్దిని రమణయ్య, కొంకాన తిరుపతిరావులకు చెందిన 30 ఎకరాల గడ్డవాములు దగ్ధమయ్యాయి. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మధ్యాహ్నం 12.30 సమయంలో ఒక్కసారిగా గడ్డివాముల నుంచి మంటలు రావడంతో వెంటనే రైతులు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా గాలి తీవ్రత అధికంగా ఉండటంతో మరింతగా వ్యాపించాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు ఆడంగి సూర్యనారాయణ ఇచ్చిన సమాచారంతో నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే గడ్డివాములు కాలిపోయాయి. ఇదే కళ్లంలో ఉన్న ధాన్యం బస్తాలను రైతులు వెంటనే ఇతర ప్రాంతానికి తరలించడంతో నష్టం తగ్గింది. రైతుల కళ్లాలపై నుంచి విద్యుత్ వైర్లు ఉండటం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు రైతులు అనుమానిస్తున్నారు. పశువుల కోసం ఉంచిన గడ్డి వాములు కాలిపోవడంతో రైతులు ఆందోళన చెందారు.