మరో మూడు సమీకృత గురుకులాలు
నల్లగొండ: ఉమ్మడి జిల్లాకు మరో మూడు సమీకృత గురుకులాలు మంజూరయ్యాయి. నకిరేకల్, నాగార్జునసాగర్, కోదాడ నియోజకవర్గాల్లో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. సమీకృత గురుకులాలు రెండో దశలో భాగంగా వీటిని మంజూరు చేసినట్లు ఆయన ఆ ఊత్తర్వుల్లో పేర్కొన్నారు.
24న ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీలు
సూర్యాపేట టౌన్: అండర్–11, 15 ఓపెన్ విభాగాల్లో బాలబాలికలకు ఈ నెల 24న సూర్యాపేటలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండూరి కృపాకర్, సతీష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీ య నగదు బహుమతులతో పాటు షీల్డ్, ప్రశంస పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
నిబంధనల మేరకు ధాన్యం కొనాలి
చిలుకూరు: ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తూ ధాన్యం కొనాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. చిలుకూరు మండల కేంద్రంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. ఆయన వెంట తహసీల్దార్ ధృవకుమార్, ఆర్‌ఐ మంత్రిప్రగడ సీతయ్య, ఏఓ శ్రీధర్, ఏఈఓ శిరీష, సీసీ స్వరూప, ఐకేపీ నిర్వాహకులు పాల్గొన్నారు.
రేపు కబడ్డీ జిల్లా మహిళా జట్టు ఎంపిక
కోదాడ: డిసెంబర్ 7 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో జరిగే సీనియర్స్ మహిళా కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా జట్టు ఎంపిక ఆదివారం కోదాడలోని ఎంఎస్ జూనియర్ కళాశాలలో జరుగుతుందని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అడ్‌హక్ కమిటీ చైర్మన్ భూలోకరావు, కన్వీనర్ కర్తయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక కోసం హాజరయ్యే క్రీడాకారులు 75 కేజీల లోపు బరువు ఉండాలని, ఆధార్‌కార్డ్ జిరాక్స్ తీసుకొని రావాలని కోరారు. సెలక్షన్స్ మ్యాట్‌పై నిర్వహిస్తున్నందున క్రీడాకారులు తప్పనిసరిగా మ్యాట్‌షూస్‌తో రావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ : 99123 81165 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
నాణ్యమైన భోజనం
అందించాలి
చివ్వెంల: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాధికారి(డీఈఓ) బి.అశోక్ అన్నారు. శుక్రవారం చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో ముందుగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించారు. ఇతర వివరాలను హెచ్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. పది ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆయన వెంట ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు.
హైకోర్టు ఉత్తర్వులను
అమలు చేయాలి
భానుపురి(సూర్యాపేట): కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ విధానంపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సీతారామయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎన్.సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంబాబు శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు జిల్లా ట్రెజరర్, సబ్ ట్రెజరర్ అధికారులను రాష్ట్ర ఫైనాన్స్ ట్రెజరర్ అధికారులు ఆదేశించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment