
గాలిదుమారం.. వడగండ్లు
సూర్యాపేట అర్బన్, ఆత్మకూర్(ఎస్), తిరుమలగిరి, అర్వపల్లి, నూతనకల్ నాగారం, నడిగూడెం : అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. అకాల వర్షాలు రైతులకు అంతులేని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత దశలో ఉన్న వరి నేలవాలింది. కరెంట్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
● సూర్యాపేట పట్టణంలో బలమైన ఈదురు గాలులు వీయంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సుమారు రెండు గంటల తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఈదురుగాలుల బీభత్సవానికి కుడకుడలోని ఓ ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. ప్రహరీ కూలిపోయింది.
● నాగారం మండలంలో వరిచేలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. నర్సింహులగూడెం గ్రామాలనికి వెళ్లే రహదారిపై చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో వరి పైరు నేలకొరగగా, మామిడి, నిమ్మ తోటలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
● ఆత్మకూర్(ఎస్) మండలంలోని పలు గ్రామాల్లో చెట్లు విరిగి, విద్యుత్ స్తంభాలు కూలాయి. సుమారు 40 నిమిషాల పాటు ఈదురు గాలులు వీయడంతోపాటు రాళ్ల వర్షం కురిసింది. పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అకస్మాత్తుగా వచ్చిన గాలివానతో ధాన్యం రాశులపై పట్టాలు కప్పడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు.
● తిరుమలగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరద నీరు చేరింది. భారీ ఈదురు గాలులకు మామిడి, నిమ్మకాయలు నేల రాలాయి. అదేవిధంగా నూతనకల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వర్షానికి తడిసి ముద్దయింది.
● జాజిరెడ్డిగూడెం మండలంలోరైతులు తీవ్రంగా నష్టపోయారు. జాజిరెడ్డిగూడెం. అర్వపల్లి, కోడూరు, తూర్పుతండా కాసర్లపహాడ్ తదితర గ్రామాల్లో వరిపంటలకు నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో కొంత ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. జాజిరెడ్డిగూడెంలో నోముల నరేష్ ఇంట్లో చెట్టుకొమ్మ విరిగి గేదైపె పడి మృతిచెందింది. అర్వపల్లిలో హైవేలు జలమయమయ్యాయి. మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
● నడిగూడెం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బృందావనపురం గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. నడిగూడెంలోని ప్రధాన రహదారిపై ఉన్న పలు భారీ వృక్షాల కొమ్మలు విరిగాయి.
ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
ఫ నేలరాలిన మామిడి, నిమ్మకాయలు
ఫ పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు
అంతరాయం
ఫ చెట్ల కొమ్మలు విరిగి పడడంతో
రాకపోకలకు అంతరాయం
ధాన్యం పూర్తిగా తడిసిపోయింది
అమీనాబాద్ ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చాను. ధాన్యం ఆరబోసుకుని కాంటాల కోసం ఎదురు చూస్తున్నా. ఆదివారం కురిసిన వడగండ్ల వానకు ధాన్యం కల్లంలోనే తడసిపోయింది. పూర్తిగా నష్టం వాటిల్లింది.
– నాగరాజు, రైతు అమీనాబాద్,
అనంతగిరి మండలం

గాలిదుమారం.. వడగండ్లు

గాలిదుమారం.. వడగండ్లు

గాలిదుమారం.. వడగండ్లు

గాలిదుమారం.. వడగండ్లు