అన్నానగర్: మామల్లపురం మత్స్యకార ప్రాంతం వద్ద సముద్రంలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. చైన్నెలోని అన్నానగర్ వెస్ట్ కంబర్ కాలనీలో నివాసముంటున్న శ్రీధర్‌కు బట్టల దుకాణం ఉంది. ఇతని కుమారుడు గిరీష్ కేశవ్(20) మొగప్పేర్ ప్రాంతంలోని ఆర్ట్స్ కళాశాలలో బీకాం 3వ సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రిజ్వానన్‌కు బొగ్గుల దుకాణం ఉంది. క్యాటరింగ్ పూర్తి చేసిన కుమారుడు రియాజ్(18) పెళ్లిళ్లు, ప్రత్యేక కార్యక్రమాలకు పార్ట్‌టైమ్ షెఫ్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులైన వీరిద్దరూ అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు రహషాద్(18), ఆకాష్ (19), యువతి ఆర్య(18)తో కలిసి ఆదివారం మామల్లపురం వచ్చారు. ఐదుగురు మామల్లపురం మత్స్యకార ప్రాంతం వద్దకు వచ్చి అక్కడ సముద్ర స్నానం చేశారు. సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతుండగా పెద్ద కెరటం తాకడంతో గిరీష్ కేశవ్, రియాజ్ సముద్రం మధ్యలోకి కొట్టుకెళ్లిపోయారు. కోస్ట్ గార్డ్ పోలీసులు, ఈతగాళ్లు, మత్స్యకారుల సాయంతో బోటులో లోతైన సముద్రంలోకి వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ పరిస్థితిలో సోమవారం రియాజ్ మృతదేహం మామళ్లపురం సమీపంలోని వేంపురుషం బీచ్ వద్ద, గిరీష్ కేశవ్ మృతదేహం ఉయ్యాలికుప్పం బీచ్ వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చింది. పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment