అత్యాచారం కేసు విచారణకు ప్రత్యేక కమిటీ
● సుప్రీంకోర్టు ఆదేశం
అన్నానగర్: చైన్నె అన్నానగర్ బాలిక అత్యాచారం, వేధింపులకు సంబంధించిన పోక్సో కేసును పైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత చైన్నె హైకోర్టు, సీబీఐ ఆదేశాలపై పోలీసులు దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు విచారించింది. తమిళనాడులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌ని ఏర్పాటు చేసి, అందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారుల సంక్షిప్త వివరాలతో ఏడుగురితో కూడిన జాబితాను సమర్పించాల్సి ఉంది. ఈ కేసులో సోమవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు సూర్యకాంత, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సెషన్‌లో కేసు మళ్లీ విచారణకు వచ్చింది. ఆ సమయంలో తమిళనాడు పోలీసులు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం రోజువారీ విచారణ జరపాలి. దీనిని మద్రాసు హైకోర్టు పర్యవేక్షించాలి, ప్రత్యేక దర్యాప్తు బృందం మొదటి దర్యాప్తు నివేదికను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు సమర్పించాలని తెలిపారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ నివేదిక ఆధారంగా కేసు విచారణకు తగిన సెషన్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు. కేసు దర్యాప్తునకు ఏర్పాటైన సెషన్‌కు ముందు, వారానికి ఒకసారి ప్రత్యేక దర్యాప్తు బృందం తన దర్యాప్తు స్థితి నివేదికను సమర్పించాలని వారు ఆదేశించారు. దీని తరువాత ఈ కేసుకు అయ్యే ఖర్చు రూ.50 వేలు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు తమిళనాడు ప్రభుత్వం బాధిత బాలిక తల్లికి వారం రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు.
యువతి ఆత్మహత్య
అన్నానగర్: కాట్టుమన్నార్‌కోయిల్ సమీపంలో వరకట్న వేధింపులతో మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి రిటైర్డ్ ఎస్‌ఐ, అతని భార్యను అరెస్టు చేశారు. కడలూరు జిల్లా కట్టుమన్నార్కోవిల్ సమీపంలోని మోవూరు గ్రామానికి చెందిన సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఎస్‌ఐగా పనిచేసి రిటైరైన సెంగుట్టువన్(65), ఇతని భార్య భానుమతి(60). వీరికి కుమారుడు కయల్వేందన్(32) ఉన్నాడు. ఇతనికి సేదీయాతోపు సమీపంలోని వీరముడయ నాథం గ్రామానికి చెందిన అరుళ్‌ప్రకాశం కుమార్తె కయల్‌విళి(29)తో 4 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కయల్వేందన్ అండమాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో కయల్‌విళి తన అత్తమామలతో కలిసి భర్త ఇంట్లోనే ఉంటోంది. ఈ స్థితిలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న కయల్‌విళి పంటలకు పిచికారీ చేసేందుకు ఉపయోగించే పురుగుమందు(విషం) తాగింది. స్పృహతప్పి పడిపోయిన ఆమెని కుటుంబ సభ్యులు రక్షించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్ ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కయల్‌విళి తల్లి మహాలక్ష్మి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని, ఆమె మామ, అత్తగారు తన కుమార్తెను వరకట్నం డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు సెంగుట్టువన్, భానుమతిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇల్లు కూల్చివేతపై నోటీస్
● కార్మికుడి ఆత్మహత్య
అన్నానగర్: తిరువేర్కాడు, కోలాడి, చెల్లియమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన శంకర్(45) కార్పెంటర్. కొద్ది రోజుల క్రితం కొలాడి సరస్సును శుభ్రం చేసి అనేక ఇళ్లు, భవనాలు నిర్మించాడు. రెవెన్యూ శాఖ అధికారులు దీనిని జేసీబీ యంత్రం ద్వారా కూల్చివేసేందుకు వచ్చారు. ప్రజలు నిరసన తెలపడంతో ఆక్రమణలకు గురైన భవనాల కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం దేవదాయ శాఖ అధికారులు కొలాడి సరస్సులోని ఆక్రమణలను మరోసారి పరిశీలించారు. వీటిలో వెయ్యికి పైగా ఇళ్లు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. గత వారం అధికారులు ఆక్రమణలకు గురైన ఇళ్లు, భవనాల కూల్చివేత, ఆక్రమణల తొలగింపునకు సంబంధించి నోటీసులు అతికించారు. శంకర్ ఇంటికి కూడా నోటీసు అంటించారు. దీంతో అతడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతని కుటుంబంతో అతని ఇల్లు కూల్చివేయడం గురించి అతను తరచూ విలపించేవాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న శంకర్ హఠాత్తుగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు తన ఇంటిని కూల్చేస్తారేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అతని బంధువులు తిరువేర్కాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొడుకు అరెస్టుపై తల్లి పిటిషన్
కొరుక్కుపేట: తమిళనాడు బహుజన సమాజ్ పార్టీ నేత ఆమ్‌స్ట్రాంగ్ హత్య కేసులో చైన్నె వ్యాసార్పాడికి చెందిన అశ్వత్థామన్ అనే న్యాయవాది అరెస్ట్ అయ్యాడు. ఇతను ప్రముఖ రౌడీ నాగేంద్రన్ కుమారుడు. గ్యాంగ్‌స్టర్ల నిరోధక చట్టం కింద ఏడాది జైలు శిక్ష విధిస్తూ చైన్నె పోలీస్ కమిషనర్ అరుణ్ సెప్టెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అశ్వత్థామన్ తల్లి చైన్నె హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అందులో పోలీస్ కమిషనర్ కక్షపూరితంగా తన కొడుకును గూండా నిరోధక చట్టం కింద జైలులో పెట్టారని ఆరోపించింది. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎస్‌ఎం సుబ్రమణ్యం, ఎం.జ్యోతిరామన్‌ల ముందు విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు 2 వారాల్లోగా పోలీసు కమిషనర్ స్పందించి, సమాధానం ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment