‘దైవానై’ దాడిలో ఇద్దరి మృతి
● తిరుచెందూరు ఆలయంలో విషాదం ● కొన్ని గంటలపాటు ఆలయం మూత
సాక్షి, చైన్నె: ఆరుపడ్డై వీడులలో రెండవదిగా ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు సుబ్రమణ్య స్వామి ఆలయం ఆవరణలో సోమవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. ఆలయ ఏనుగు దైవానై దాడిలో మావటితో సహా మరొకరు మరణించారు. తిరుచెందూరు ఆలయానికి దేవానై(25) ఆడ ఏనుగు ఉంది. ఈ ఏనుగును భక్తితో పూజిస్తుంటారు. ఉత్సవాల సమయం, ఆలయంలో ఉదయం, సాయంత్రం వేళలో జరిగే పూజల్లో ఈ ఏనుగు పాల్గొంటుంది. ఆలయం సమీపంలోనే ఈ ఏనుగు సంరక్షణ శిబిరం ఉంది. ఈ పరిస్థితులలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దైవానై సంరక్షణ శిబిరంలో అరుపులు కేకలు వినబడంతో పోలీసులు పరుగులు తీశారు. అక్కడ దైవానై కాళ్ల కింద నలిగిన స్థితిలో ఓ యువకుడు మరణించి ఉండడాన్ని గుర్తించారు. సమీపంలో ఆ ఏనుగు సంరక్షకుడు మావటి ఉదయకుమార్ రక్తగాయాలతో పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలో అతడు మరణించారు. దైవానై దాడిలో ఇద్దరు మరణించిన సమాచారంతో తిరుచెందూరులో కలకలం రేగింది. తక్షణం ఆలయాన్ని మూసి వేసి శుద్ధి కార్యక్రమాల అనంతరం మళ్లీ పూజలు మొదలయ్యాయి. దైవానై ఆ ఇద్దర్ని ఎందుకు కొట్టి చంపిందో అన్నది మిస్టరీగా మారింది. ఆడ ఏనుగులకు మదం పట్టే అవకాశం లేని దృష్ట్యా, ఈ సంఘటన ఎలా జరిగిందోనని అక్కడి సీసీ కెమెరాలలలోని దృశ్యాలను పరిశీలించారు. మృతులలో ఉదయకుమార్, అతడి బంధువు శిశుకుమార్‌గా గుర్తించారు. శిశుకుమార్ దైవానైను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి ఉండవచ్చునని, ఆగ్రహంతో అతడిపై దాడిచేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. దీనిని అడ్డుకునే క్రమంలో ఉదయకుమార్‌పై సైతం దైవానై దాడి చేసి ఉండవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా అటవీ అధికారులు, వైద్యులు అక్కడికి చేరుకుని దైవానై ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment