అన్నానగర్: విరుదాచలంలో అడ్వొకేట్, అతని తండ్రి నుంచి రూ.కోటి 21 లక్షల మేర మోసం చేసిన బీజేపీ నేతను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని పుదుకుప్పానికి చెందిన బాలకుమారన్ కుమారుడు భాస్కర్(36) న్యాయవాది. విరుదాచలం వాయలూరు ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్(37) బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఆయన పెరియవాడవాడిలో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. ఈ స్థితిలో రాజకుమార్ భాస్కర్ కోసం విరుదాచలం ప్రాంతంలో స్థలం కొనుగోలు చేస్తానని చెప్పాడు. ఇందుకోసం రాజ్‌కుమార్‌కు రూ.44 లక్షలు భాస్కర్ అందించాడు. దీని తర్వాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తన పెట్రోల్ బంకును విస్తరించేందుకు రూ.30 లక్షలు అవసరమని కోరాడు. తన అవసరాల కోసం రూ.30 లక్షలు కూడా ఇచ్చాడు. దీంతో భాస్కర్ తాను ఇచ్చిన డబ్బులకు భూమిని తన పేరు మీద పట్టా ఇప్పించాలని కోరాడు. కానీ రాజ్‌కుమార్ ఆ స్థలాన్ని భాస్కర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో రూ.65 లక్షలకు వేరొకరికి విక్రయించాడు. అదేవిధంగా భాస్కర్ తండ్రి బాలకుమార్‌ను కూడా మోసం చేసి సుమారు రూ.47 లక్షలు తీసుకున్నాడు. ఈ విషయమై భాస్కర్ పలుమార్లు అడగగా.. పలు కారణాలతో రాజ్ కుమార్ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. డబ్బులు ఇవ్వలేనంటూ భాస్కర్‌ను రాజ్‌కుమార్ బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన భాస్కర్ కడలూరు జిల్లా ఎస్పీ రాజారాంకు ఫిర్యాదు చేశారు. దీంతో క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఫిర్యాదులో నిజం ఉందని నిర్ధారించిన పోలీసులు సోమవారం రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి కడలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment