క్యారమ్స్‌లో చైన్నె టూ అమెరికా...!
సాక్షి, చైన్నె: ఇన్నాళ్లూ ఉత్తర చైన్నె వీధులలో క్యారమ్స్ ఆడుతూ అందర్నీ అబ్బుర పరిచిన కాశీమా(17) ఇప్పుడు అమెరికా వేదికగా మూడు స్వర్ణాలతో రాష్ట్రంకు తిరిగి రాబోతుండటం గల్లీలోని సహచర క్యారమ్స్ క్రీడాకారుల్నే కాదు ఆమె కుటుంబాన్ని ఆనంద సాగరంలో ముంచింది. అమెరికాలో జరిగిన ప్రపంచ క్యారమ్స్ ఛాంపియ్‌షిప్ పోటీలలో చైన్నెకి చెందిన ఆటో డ్రైవర్ మెహబూబ్ భాషా కుమార్తె కాశీమా (17) మూడు కేటగిరీలలో బంగారు పతకాలను సాధించిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు గల్లీ వాసులకే తెలిసిన ఈ కాశీమా ప్రస్తుతం రాష్ట్రంలో సెలబట్రీ అయ్యారు. ఇందుకు కారణం క్యారమ్స్‌లో ఆమె సాధించిన ఘనతే.
పేద కుటుంబం నుంచి..
ఉత్తర చైన్నెలో న్యూ వాషర్‌మెన్ పేట షెరియన్ నగర్ రెండవ వీధిలో 21 ఏళ్లుగా మెహబూబ్ భాషా (54) నివాసం ఉన్నారు. ఆయనకు భార్య ముంతాజ్, హసీనా , అబ్దుల్ రహ్మాన్, కాశీమా పిల్లలు. హసీనాకు వివాహం చేశారు. అబ్దుల్ రహ్మాన్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.అందరిలో చిన్నదైన కాశీమా 7వ ఏట నుంచి క్యారమ్స్ మీద దృష్టి పెట్టింది. తన తండ్రి మెహబూబ్ భాషా ఆటో నడుపుకుంటూ జీవనం సాగించడమే కాకుండా, తమ ప్రాంతంలోని విద్యార్థులు,యువతకు క్యారమ్ బోర్డులను కొనుగోలు చేసి ఇచ్చి ఎలాంటి లాభాపేక్ష అన్నది లేకుండా సాయంత్రం వేళలో వీధులలో క్యారమ్స్ శిక్షణ అందిస్తూ వచ్చారు. కాల క్రమేనా ఈ శిక్షణ కోసం ఓ ప్రాంతంలో గదిని కూడా తీసుకున్నారు. 15 సంవత్సరాలుగా మెహబూబ్ శిక్షణ ఇస్తూ వచ్చాడు. తన తండ్రి ద్వారా క్యారమ్స్ మీద పట్టు సాధించిన కాశీమా, 2013–14లో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించింది. ఆ తర్వాత జూనియర్, సీనియర్ పోటీలలో పాల్గొంటూ వచ్చింది.
అంతర్జాతీయ స్థాయిలోకి..
ఆమెలోని ప్రతిభను క్యారమ్స్ అసోసియేషన్ ట్రైన ర్ మరియా గుర్తించారు. కాశీమాను తన వెన్నంటి ఉంచుకుని క్యారమ్స్ శిక్షణలో మెళుకువలను నేర్చించారు. తదుపరి ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలలో జరిగిన పోటీలకు కాశీమాను తీసుకెళ్లి సత్తా చాటే విధంగా ట్రోఫీలతో తిరిగి వచ్చారు. ఈ పరిస్థితుల్లో అమెరికాలో జరిగిన పోటీలకు తమిళనాడు తరపున కాశీమాతోపాటుగా చైన్నె వ్యాసార్పాడికి చెందిన నాగ జ్యోతి, మదురైకు చెందిన మిత్రాలు ఎంపికయ్యారు. అమెరికా పయనానికి ఆర్థిక భారం అడ్డు వచ్చిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. క్రీడల శాఖ తరపున ఈ ముగ్గురు క్రీడాకారులకు ఖర్చులకు గాను తలా రూ. 1.50 లక్షలను అందజేశారు. ప్రభుత్వం నుంచి తనకు అందిన ప్రోత్సహాన్ని పరిగణించి పతకం సాధించాలన్న కాంక్షతో దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ఫైనల్స్ కాశీమా సింగిల్స్, డబుల్స్, టీమ్ విభాగాలలో తన సత్తాను చాటారు. ఈ కేటగిరీలలో విజేతగా నిలిచి మూడు బంగారు పతకాలను కై వసం చేసుకున్నారు. నిన్న మొన్నటి వరకు కాశీమా గురించి గల్లి వరకే తెలిసిన నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాట క్రీడా సెలబ్రటీగా మారారు. ఏకంగా మూడు స్వర్ణాలను క్యారమ్స్‌లో అమెరికా వేదికగా సాధించడంతో ఆమె కుటుంబ సభ్యులను ప్రశసించే వారు పెరిగాయి. ఇక, తమతో పాటు వీధులలో క్యారమ్స్ ఆడుకున్న కాశీమా అంతర్జాతీయ వేదికపై పతకాలను సాధించడం క్యారమ్స్ క్రీడాకారుల్లో ఆనందం నింపింది. ఇక ఆమె తల్లిదండ్రల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కాశీమా గురించి, ఆమె కుటుంబ పరిస్థితి గురించి ప్రస్తుతం తమిళ మీడియా కథనాలను హోరెత్తిస్తుండటం గమనార్హం.
కశీమా ఇంట ఆనందోత్సాహాలు
చిన్నతనం నుంచే క్యారమ్స్‌లో రాణింపు
Comments
Please login to add a commentAdd a comment