మణిపూర్ హైకోర్టు సీజేగా జస్టిస్ కృష్ణకుమార్
సాక్షి, చైన్నె : మద్రాసు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి డి. కృష్ణకుమార్ మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. మద్రాసు హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ డి. కృష్ణకుమార్ కొంత కాలం ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేశారు. కొద్దిరోజుల క్రితం మద్రాసు హైకోర్టుకు సీజేగా శ్రీరామ్ పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుని సీనియర్ న్యాయమూర్తిగా కృష్ణకుమార్ ఉంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆయనని మణిపూర్ హైకోర్టు సీజేగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
2026లో కూటమి పాలనకు నో చాన్స్
● తిరుమా స్పష్టీకరణ
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడులో కూటమి పాలనకు అవకాశం లేదని వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కూటమి పాలన అన్న నినాదాన్ని వీసీకే తొలుత తెరమీదకు తెచ్చిందని గుర్తు చేశారు. ఆ దిశగా చర్చలు, సభలు, సమావేశాలు నిర్వహించామని వివరించారు. అప్పటి పరిస్థితులు వేరు అని, ఇప్పటి పరిస్థితులు వేరు అని వ్యాఖ్యలు చేశారు. ప్రసుత్తం తమిళనాడులో కూటమి పాలనకు ఆస్కారం లేదన్నారు. కూటమి పాలన ఏర్పాటు చేస్తామని డీఎంకే, అన్నాడీఎంకేలు ముందుగా ప్రకటించినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. అప్పుడే కూటమిలో తమ వాదనను చెప్పేందుకు, వినేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. కూటమి పాలనకు అన్నాడీఎంకే ముందుగా బహిరంగ ప్రకటన చేయనివ్వండి ఆ తర్వాత మాట్లాడుకుందామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2026లో తమిళనాడులో కూటమి పాలనకు అవకాశం గానీ, ఆస్కారం గానీ లేదని స్పష్టం చేశారు. ప్రజలకు కూటమి పాలన మీద ఇక్కడ అవగాహన అన్నది లేదని, ఈ దృష్ట్యా, కూటమిపాలనకు నో ఛాన్స్ అని చెప్పారు. అదేసమయంలో ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీలకు సైతం సమన్వయం అవశ్యమని వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ తెలుగు సదస్సుకు యజ్ఞశేఖరకు ఆహ్వానం
కొరుక్కుపేట: ఖతార్ దేశ రాజధాని దోహా నగరంలో ఈ నెల 22 , 23 వ తేదీలలో జరిగే 9వ ప్రపంచ తెలుగు సదస్సుకు మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ శ్రీపురం యజ్ఞశేఖర్‌కు ఆహ్వానం అందింది. ఆంధ్ర కళావేదిక, ఖతార్ , వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు తమిళనాడు రాష్ట్రం నుంచి సదస్సులో పాల్గొంటున్న ఏకై క తెలుగు ఆచార్యులు శ్రీపురం యజ్ఞశేఖర్ కావడంతో పలువురు తెలుగు ప్రముఖులు ప్రశంసించి అభినందనలు తెలిపారు. ఈ సదస్సులో ‘‘గురజాడ – మానవతావాదం’’అనే అంశంపై యజ్ఞశేఖర్ ప్రసంగించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.
స్థానికులు వ్యతిరేకిస్తే తాళం వేయాల్సిందే..!
సాక్షి, చైన్నె: తమతమ ప్రాంతాలలోని టాస్మాక్ మద్యం దుకాణాలను మూసి వేయాలని స్థానిక ప్రజలు గళం విప్పితే వాటికి తాళం వేయాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంగా దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ, టాస్మాక్ దుఖాణాలు తమప్రాంతంలో వద్దంటూ ప్రజలు పోరాడినా, వ్యతిరేకంగా గళం విప్పినా, వాటిని అక్కడి నుంచి తొలగించాల్సిందేనని ఆదేశించారు. ఆ ప్రాంతంలో దుకాణం తొలగించి మరోచోట ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అలాగే లీజు కాలం ముగిసినా దుకాణాలను ఖాళీ చేయకుండా భవన యజామనులపై ప్రతాపం చూపించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించింది.
గంగై కొండంలో సోలార్ ప్యానెల్
● పర్యావరణ శాఖ అనుమతి
సాక్షి,చైన్నె : తిరునల్వేలి జిల్లా గంగై కొండంలో సోలార్ ప్యానెల్ ఉత్పత్తి పరిశ్రమకు రాష్ట్ర పర్యావరణ శాఖ అనుమతి మంజూరు చేసింది. రూ.1,260 కోట్ల పెట్టుబడితో 3150 మందికి ఉద్యోగ కల్పన దిశగా ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. సోలార్ సెల్, పీవీ సోలార్ మాడ్యుర్ వంటి ఉత్పత్తులు ఇక్కడ తయారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment