సర్వం సిద్ధం
కార్తీక
దీపోత్సవానికి
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో ఈనెల 4వ తేదీ నుంచి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 10వ రోజైన శుక్రవారం ఉదయం ఆలయం ఎదుటనున్న మూలవర్ సన్నిధిలో భరణిదీపం వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటలకు అర్ధనారేశ్వరుడు ఏడాదికి ఒకసారి ప్రత్యేక వాహనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇదే సమయంలో అరుణాచలేశ్వరాలయం వెనుకనున్న 2,668 అడుగుల ఎత్తుగల కొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. మహాదీపం వెలిగించే సమయంలో ఆలయం వద్దనున్న భక్తులు అరుణాచలేశ్వరునికి హరోంహరా.. అంటూ నామస్మరణాలు చేసుకుంటారు. ఈ మహా దీపోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా సుమారు 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
ప్రత్యేక బస్సులు
దీపోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు కలెక్టర్ భాస్కర పాండియన్ తెలిపారు. ఈ సంవత్సరం పుదుచ్చేరి, చైన్నె, తిరిచ్చి, బెంగుళూరు, సేలం, విల్లుపురం, కాట్పాడి తదితర ప్రాంతాల నుంచి ఈనెల 12,13, 14వ తేదీల్లో మూడు వేల ప్రత్యేక బస్సులను నడిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇప్పటికే బస్సులు, కార్లు, ద్విచక్ర వాహణాలు పట్టణంలోనికి రాకుండా ముందుస్తుగా 24 తాత్కాలిక బస్టాండ్‌లు, అక్కడక్కడ కారు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఐదు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో మహా దీపం కొండపైకి భక్తులు ఎక్కిందుకు అనుమతి నిరాకరించారు. కొండపైకి వెల్లే మొత్తం 12 దారులను మూసి వేసి అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహా దీపం వెలిగించే ఆలయ అర్చకులు, పారంపర్య వంసస్థలు, ఆలయ సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందని వారు కూడా సంరక్షణా పరికరాలతో కొండపైకి ఎక్కిందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
పటిష్ట బందోబస్తు
మహా దీపోత్సవానికి ఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఆలయం లోపల, వెలుపల సీసీ కెమెరాలను ఉంచి ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో 54 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు 39 ప్రాంతాల్లో తాత్కాలిక పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటితో పాటు మానవ రహిత విమానంతో కూడా ప్రత్యేక నిఘా ఉంచి ఎటువంటి చోరీలు జరగకుండా చూస్తామన్నారు. 40 మందికి పైగా కమెండో వీరులు, 200 ప్రత్యేక పోలీస్ వీరులతో నిఘా ఉంచామన్నారు. ఉదయం భరణి దీపం వెలిగించే సమయంలో అనుమతి ఇచ్చిన భక్తులు, మహా దీపం వెలిగించే సమయంలో 2,500 మందిని మాత్రమే ఆలయంలోనికి అనుమతిస్తామన్నారు. అదేవిధంగా తిరువణ్ణామలైలో ట్రాఫిక్‌ను మూడు రోజులకు మార్పు చేసినట్లు తెలిపారు.
35 కిలో మీటర్లు కనిపించే మహాదీపం
ఉత్సవాల్లో పదో రోజు వేకువన 4 గంటలకు ఆలయం ముందు భరణి దీపాన్ని గర్భగుడిలో ప్రజ్వలింప జేయడం ఆనవాయితీ. అదేరోజు సాయంత్రం 6 గంటలకు 2,668 అడుగుల ఎత్తుగల శివునిగా భావించే కొండపైనా మహా దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం 35 కిలో మీటర్ల దూరం నుంచి చూసినా ఈ దీప కాంతి సృష్టంగా కనిపించడం విశేషం. ఈ దీపం పది రోజుల పాటు వెలుగుతూనే భక్తులకు దర్శనమివ్వనుంది. కాగా తిరువణ్ణామలై జిల్లాలో వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తులు వాటిని లెక్క చేయకుండా స్వామి వారి ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.
కై లాస వాహనంలో ఊరేగిన అరుణాచలేశ్వరుడు
ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారు కై లాస వాహనంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 9 గంటలకు మూషిక వాహనంలో వినాయకుడు, హంస వాహనంలో వళ్లి దైవాని సమేద మురుగన్, కై లాస వాహణంలో ఉన్నామలై సమేద అన్నామలైయార్, కామదేను వాహనంలో పరాశక్తి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం మూషిక వాహనంలో వినాయకుడు, పురుష ముని వాహనంలో చంద్రశేఖరుడు మాడ వీధుల్లో విహరించారు.
నేడు 2,668 అడుగుల ఎత్తయిన
కొండపై మహాదీపం వెలిగింపు
భారీ పోలీస్ బందోబస్తు
లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment