ఆధిపత్య రహిత సమాజ స్థాపనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆధిపత్య రహిత సమాజ స్థాపనే లక్ష్యం

Published Fri, Dec 13 2024 1:52 AM | Last Updated on Fri, Dec 13 2024 1:52 AM

ఆధిపత

ఆధిపత్య రహిత సమాజ స్థాపనే లక్ష్యం

● వైకం ఉద్యమ స్ఫూర్తితో విజయం వైపుగా అడుగులు ●కేరళలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ వ్యాఖ్య ●కొట్టాయం వేదికగా పెరియార్‌ శత జయంతి స్మారక గ్రంథాలయం

సాక్షి, చైన్నె: వైకం ఉద్యమ స్ఫూర్తితో అన్ని రంగాలలో విజయం వైపుగా అడుగులు వేయడమే కాదు, ఆధిపత్య రహిత సమ సమాజ స్థాపనే లక్ష్యంగా ముందుకెళ్దామని సీఎం స్టాలిన్‌ పిలుపు నిచ్చారు. కేరళ రాష్ట్రం కొట్టాయంలో రూపుదిద్దుకున్న ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌ శత జయంతి స్మారక గ్రంథాలయంను ఆ రాష్ట్ర సీఎం పినరాయ్‌ విజయన్‌తో పాటుగా స్టాలిన్‌ గురువారం ప్రారంభించారు. వివరాలు.. 1924లో కేరళ రాష్ట్ర కొట్టాయంలో అట్టడుగు వర్గాలపై అణిచి వేత దాడులకు నిరసనగా ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌ గళం విప్పడమే కాదు, ఆయన రాసిన ఓ లేఖ వైకం ఉద్యమానికి నాంది పలికింది. ఇది జరిగి శతాబ్ధ కాలమైంది. ఈ ఉద్యమంతో పాటు పెరియార్‌ శత జయంతి స్మారకంగా ద్రవిడ కళగం నేత కె వీరమణి అధ్యక్షతన కొట్టాయం జిల్లా వైకంలో గురువారం బ్రహ్మాండ వేడుక జరిగింది. ఇక్కడి పెరియార్‌ స్మారకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించింది. రూ. 8.14 కోట్లతో చేపట్టిన పనులు ప్రస్తుతం ముగిశాయి. ఇక్కడ బ్రహ్మాండ భవనంలో గ్రంథాలయం సైతం శత జయంతి స్మారకంగా రూపుదిద్దుకుంది. వీటిని కేరళ సీఎం పినరాయ్‌ విజయన్‌తో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. తమిళరసు ముద్రణ ద్వారా సిద్ధం చేసిన వైకం పోరాటం శతాబ్ధి ఉత్సవాల సావనీరును స్టాలిన్‌ ఆవిష్కరించగా పినరాయ్‌ విజయన్‌ అందుకున్నారు. అలాగే కేరళ ప్రభుత్వం ద్వారా సిద్ధం చేసిన శ్రీపెరియారుం – వైకం ఉగ్థరుమ్ఙ్‌ పుస్తకంను పినరాయ్‌ విజయన్‌ ఆవిష్కరించగా స్టాలిన్‌ అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రచా పనుల శాఖ పనురుద్ధరించిన ఫొటో ఎగ్జిబిషన్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ను ప్రారంభించారు. 2024 సంవత్సరానికి గాను వైకం అవార్డు కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాకు చెందినది రచయిత, సామాజిక కార్యకర్త దేవనూర మహాదేవకు ఈ సందర్భంగా ప్రదానం చేశారు. రూ. 5 లక్షల చెక్కును ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురై మురుగన్‌, ఏవి వేలు, రఘుపతి, ముత్తుస్వామి, స్వామినాథన్‌, కోవి చెలియన్‌, కయల్వెలి సెల్వరాజ్‌, కేరళ మంత్రులు షాజి చెరియన్‌,వీఎన్‌ వాసవన్‌, ఎంపీలు ఫ్రాన్సిస్‌ , తిరుమావళవన్‌, అందియూరు సెల్వరాజ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం తదితరులు పాల్గొన్నారు.

చరిత్రలో లిఖించ దగిన రోజు..

సామాజిక న్యాయ చరిత్రలో శతాబ్ధి వేడుకలు చరిత్రలో లఖించ దగిన రోజు అని సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తమిళనాడు, కేరళ ప్రభుత్వాల తరపున ఈ గొప్ప స్మారకం ఏర్పాటు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వైకం పోరాటం, ఉద్యమ విజయం గురించి వివరించారు. ఆ నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ వ్యాఖ్య లు చేశారు. పెరియార్‌ను వైకం యోధుడు అని పిలిచేవారు అని గుర్తు చేశారు. వైకం పోరాటం కేవలం కేరళ పోరాటం మాత్రమే కాదు అని పేర్కొంటూ, భారతదేశంలో మొదలైన వివిధ సామాజిక న్యాయ పోరాటాలకు నాంది అని వివరించారు. పెరియార్‌, అంబేడ్కర్‌, తదితరుల ఆలోచనలను గుర్తు చేస్తూ, అందరికీ అన్నీ అనే విధానంతో తమిళనాట ద్రావిడ మోడల్‌ పాలన సాగుతోందన్నారు. తమిళనాడులాగే కేరళలోనూ అనేక మంది యోధులు ఉన్నారని పేర్కొంటూ, పోరాటయోధులను స్మరిస్తూ, ఈ ఉద్యమ స్ఫూర్తితో అన్ని రంగాలలో విజయం వైపుగా అడుగులు వేద్దామన్నారు. వైకం వ్యక్తిగత విజయం కాదని.. ఇది కొనసాగింపు.. విజయాలకు నాంది అని వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల్లో నిరంతర విజయాన్ని సాధించాలని సంకల్పించామని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఛేదించేందుకు సిద్ధం అని ధీమా వ్యక్తం చేశారు. ఆధిపత్యం లేని సమ సమాజాన్ని నిర్మిద్దాం, పెరియార్‌ కీర్తి చిరకాలం వర్ధిల్లే రీతిలో ముందడుగు వేద్దామని సీఎం పిలుపు నిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆధిపత్య రహిత సమాజ స్థాపనే లక్ష్యం 1
1/1

ఆధిపత్య రహిత సమాజ స్థాపనే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement