క్లుప్తంగా
ప్రభుత్వ బస్సు బోల్తా
● ప్రయాణికులకు స్వల్ప గాయాలు
తిరువళ్లూరు: పొన్నేరి సమీపంలో ప్రభుత్వ బస్సు బోల్తా కొట్టిన సంఘటనలో అదృష్టవశాత్తు ప్రయాణికులు స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నుంచి సానాపుత్తూరుకు ప్రభుత్వ బస్సు గురువారం ఉదయం 16 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు అరసూరు–కాట్టవూరు మలుపు వద్ద బస్సు అదుపుతప్పి బస్సు సమీపంలోని వ్యవసాయ భూమిలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాధంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిని పొన్నేరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించేశారు. పొన్నేరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుచ్చిలో స్కౌట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు
● రూ.39 కోట్ల కేటాయింపు
తిరువొత్తియూరు: తిరుచ్చిలో జనవరిలో నిర్వహించనున్న స్కౌట్ జాతీయ వజ్రోత్సవాలకు రూ.39 కోట్లు కేటాయిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మధుమతి విడుదల చేసిన ప్రకటనలో తమిళనాడు ప్రభుత్వం 2025 జనవరిలో తిరుచ్చి జిల్లా మనపరైలో భారత్ స్కౌట్ డైమండ్ జూబ్లీని నిర్వహించనుంది. ఈ ఉత్సవాలు 7 రోజుల పాటు జరుగుతుందని, ఇందులో బ్యాండ్ గ్రూప్, కలర్ ఫుల్ టీమ్ ఫిజికల్ స్కిల్స్ డెమోన్‌స్ట్రేషన్, ఫోక్ డ్యాన్స్, ఫుడ్ ఫెస్టివల్, సాహస విన్యాసాలు వంటి వివిధ కార్యక్రమాలు ఇందులో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో 25 వేల మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొననున్నారు. వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతుందని విద్యా శాఖ కార్యదర్శి తెలిపారు.
సీసింగ్ రాజా ఆస్తుల వివరాల పరిశీలన
కొరుక్కుపేట: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపబడిన సీసింగ్ రాజాకు సంబంధించి వండలూరు, కీలంబాక్కం, తాంబరం వద్ద ఉన్న ఆస్తులను నలుగురు ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలోని బృందం గురువారం పరిశీలించింది. ఈమేరకు త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మరణంలోనూ వీడని బంధం
● భర్త మృతి..మనస్తాపంతో భార్య
అన్నానగర్: ఉసిలంబట్టి సమీపంలో గురువారం భర్త మృతిచెందడంతో మనస్తాపంతో భార్య కూడా మరణిచండంతో విషాదం నెలకొంది. మదురై జిల్లా ఉసిలంబట్టి సమీపంలోని కవనం పట్టికి చెందిన సుబ్రమణ్యం, పాండియమ్మాల్ దంపతులు. సుబ్రమణ్యం భవన నిర్మాణ కార్మికుడు. పెళ్లయి 36 ఏళ్లుగా వారికి సంతానం లేదు. ఈక్రమంలో 7న సుబ్రమణికి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. భర్త చనిపోయిన క్షణం నుంచి కోలుకోలేని దుఃఖంతో ఉన్న పాండియమ్మాల్, భర్త అంత్యక్రియలకు వెళుతుండగా ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే పాండియమ్మాల్‌ను బంధువులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. షాక్‌కు గురైన బంధువులు పాండియమ్మాళ్ ను శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. అక్కడ సుబ్రమణియన్, పాండియమ్మాల్ మృతదేహాలను కలిసి కాల్చారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలతో..!
● ఇద్దరు ఆడపిల్లలను
బావిలో పడేసి చంపిన తల్లి
అన్నానగర్: శివగంగై జిల్లా మదగుపట్టి సమీపంలోని తిరుమన్ పట్టీకి చెందిన చంద్రన్ భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేస్తున్నాడు. ఇతనికి తిరుమల గ్రామానికి చెందిన రంజితతో 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు కీర్తి (5), సంగీత (3) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొన్ని నెలలుగా భర్త,భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా చంద్రన్ అప్పుడప్పుడూ పని నిమిత్తం విదేశాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం దంపతుల మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. తర్వాత చంద్రన్ పనికి వెళ్లాడు. కాగా రంజిత చాలా సేపుగా తిరుమలై గ్రామంలో తిరుగుతోంది. ఇది చూసిన చంద్రన్ బంధువులకు అనుమానం వచ్చి సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే చంద్రన్ భార్యను సెల్‌ఫోన్‌లో సంప్రదించాడు. పిల్లలు ఎక్కడున్నారని ఆరా తీస్తే కీళపూంగుడి ప్రాంతంలోని అయ్యనార్ ఆలయ సమీపంలోని బావిలో తోసేసి చంపి ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పింది. అయితే తనకు ఈత తెలియడంతో తప్పింటుకున్నట్లు పేర్కొంది. దీంతో చంద్రన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో తేలియాడుతున్న చిన్నారుల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం శివగంగై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత తల్లి రంజితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment