తిరువళ్లూరు: చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే పూండి రిజర్వాయర్ నీటి మట్టం పూర్తిస్థాయికి చేరిన క్రమంలో ఐదు వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ పూండి సత్యమూర్తి సాగర్. ఆంధ్ర నుంచి వచ్చే కృష్ణాజలాలు, వర్షపు నీటిని నిల్వ వుంచి అక్కడి నుంచి వేర్వేరు రిజర్వాయర్‌లకు నీటిని తరలించి అక్కడ శుద్ధీకరణ చేసిన తరువాత చైన్నె ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. రిజర్వాయర్ మొత్తం నీటి సామర్థ్యం 35 అడుగులు కాగా ఇక్కడ మూడున్నర టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. బుధవారం నాటికి 33 అడుగుల చేరిన నీటి మట్టం గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కావడంతో ఇన్‌ఫ్లో పెరిగి పూర్థిస్థాయి నీటి మట్టానికి చేరింది. పూండి రిజర్వాయర్ పూర్థిగా నిండిన క్రమంలో నాలుగు గేట్ల ద్వారా 5,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కుశస్థలీ వరద ప్రవాహం పెరిగింది. కాగా రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో 3,500 క్యూసెక్కులు వస్తున్న క్రమంలో రాత్రికి మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు అంచనా వేశారు. దీంతో రాత్రికి రిజర్వాయర్ నుంచి మరింత నీటిని దిగువకు విడుదల చేస్తామని పీడబ్ల్యూడీ అధికారులు ప్రకటించారు.
25 గ్రామాలకు ముంపు హెచ్చరిక
పూండి రిజర్వాయర్ నుంచి గురువారం సాయంత్రం నాలుగు గేట్ల ద్వారా 5,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన క్రమంలో రాత్రికి అదనంగా నీటిని విడుదల చేసే అవకాశం వున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో కుశస్థలిలో వరద ప్రవాహం పెరగనుంది. దీంతో కుశస్థలి 25 గ్రామాలకు ముంపు హెచ్చరిక జారీ చేసిన కలెక్టర్ ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment