● పార్టీని తాకట్టు పెట్టం ● ఎడపాడి పళణిస్వామి వ్యాఖ్య
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వంకు అన్నాడీఎంకేలోకి నో ఎంట్రీ అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళణిస్వామి స్పష్టం చేశారు. పార్టీని తాము ఎవరికీ తాకట్టు పెట్టమని, తమ ప్రత్యర్థి డీఎంకే మాత్రమే అని వ్యాఖ్యానించారు. గురువారం పళణి స్వామి స్థానికంగా మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అన్నాడీఎంకేలోకి పన్నీరు సెల్వంను చేర్చుకునే ప్రసక్తే లేదని, చీలిక..చీలికే... అని స్పష్టం చేశారు. ప్రత్యర్థులకు పార్టీని తాకట్టు పెట్టి నీరుగార్చే ప్రయత్నం చేసిన ద్రోహులను అన్నాడీఎంకేలోకి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ప్రతి కార్యకర్త దేవాలయంగా భావించే అన్నాడీఎంకే కార్యాలయంలోకి రౌడీలను తీసుకెళ్లి దాడులు చేయించిన వారిని తాము ఎలా చేర్చుకుంటామనుకుంటున్నారని ఎదురు ప్రశ్న వేశారు. చీలిక చీలికే అని, ఇక అతికే ప్రసక్తే లేదన్నారు. పార్టీని తాకట్టు పెట్టడాన్ని తాము భరించ లేకున్నామన్నారు. తమకు ప్రధాన, ఏకై క ప్రత్యర్థి డీఎంకే మాత్రమేనని, వారిని ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. తమకు ఇతర పార్టీలు వ్యతిరేకం కాదు అని, ఏకాభిప్రాయం కలిగిన పార్టీలు తమతో కలిసి అడుగులు వేయవచ్చు అని బీజేపీతో పొత్తు ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్నాడీఎంకేను తాము ఎవ్వరికీ తాకట్టు పెట్టబోమని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం పన్నీరు సెల్వం స్పందిస్తూ, అన్నాడీఎంకే రానున్న ఎన్నికలలో గెలవకూడదన్న లక్ష్యంతోనే పళణి స్వామి చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా వాళ్లు సర్వ సభ్య సమావేశాన్ని హాజరు పరిస్తే, తాను తన మద్దతు దారులతో పార్టీ కార్యాలయానికి వెళ్లానని , అయితే మార్గం మధ్యలో గుండాల ద్వారా తమ మీద దాడి చేయించారని, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఏక నాయత్వం కింద అన్నాడీఎంకే కొనసాగితే కష్టాలు తప్పదని, ఓటములు తప్పదని హెచ్చరించారు. అందుకే అన్ని శక్తులు ఏకం కావాలని తాను ఆశిస్తున్నానని,అయితే,పళణి స్వామి అందుకు విరుద్దంగావ్యవహరిస్తూ, పార్టీని ఓటమి అంచులలోకి తీసుకెళుతున్నారని ధ్వజమెత్తారు.