సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని హిందూ మత ధార్మికశాఖ రూపొందించిన అరుదైన భక్తి గ్రంధాలు, ప్రవచనాల పుస్తకాలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వీటిని భక్తులకు అందించేందుకు వీలుగా 100 దేవాలయాల్లో పుస్తక దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. భక్తిసాహిత్యం, ఇతిహాసాలు, ఆచారాలు, సాధువుల చరిత్రలు, ఆలయ కళా పుస్తకాలు, విగ్రహ పుస్తకాలు, పురాణ పుస్తకాలు, చిత్రలేఖన పుస్తకాలు, ప్రాచీన తమిళ పత్రాలు, దైవ సేవకుల రచనలు, సామెతలుగా, సత్యాన్ని బోధించే రక్షించే సిద్ధ పుస్తకాలు అంటూ అరుదైన 216 రకాల భక్తి పుస్తకాలను ప్రచురించారు. ఇదివరకు 103 దేవాలయాల్లో పుస్తక అమ్మకాలకు చర్యలు తీసుకోగా, ప్రస్తుతం మరో 100 ఆలయాలలో వద్ద దుకాణాలను ఏర్పాటు చేశారు. మంత్రి శేఖర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. మణివాసన్, కమిషనర్ పి.ఎన్. శ్రీధర్, అదనపు కమిషనర్లు సి. హరిప్రియ, బి.సి. జయరామన్ హాజరయ్యారు. అలాగే, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్, వైద్య సిబ్బంది సెలక్షన్ బోర్డు ద్వారా వివిధ పోస్టులకు ఎంపిక చేసిన వారికి ఉద్యోగ నియామకాల ఉత్తర్వులను సీఎం స్టాలిన్ అందజేశారు. మొత్తం 621 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో డెయిరీ శాఖలో 64 మంది, చేనేత, జౌళి శాఖలో 166 మందిని, ఆరోగ్య విభాగం తరఫున 391 మంది ఉన్నారు. మంత్రులు ఆర్‌ఎస్ రాజకన్నప్పన్, ఆర్ గాంధీ, ఎం.సుబ్రమణియన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.సెంథిల్‌కుమార్, జౌళిశాఖ కార్యదర్శి అముదవల్లి పాల్గొన్నారు.
వంద ఆలయాల్లో పుస్తక దుకాణాలు