బ్యాంకాక్ నుంచి తెచ్చిన ఒకరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: మరోసారి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్ (మట్టి లేకుండా సాగు) గంజాయిని భారత్ తరలించడం ఇటీవల పెరిగింది. ఈ తరహాలో విదేశాల నుంచి గంజాయి తెస్తున్న వారిపై డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు నిఘా పెంచారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు పెద్ద మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు శనివారం విమానాశ్రయంలో నిఘా పెట్టారు.
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక ప్రయాణికురాలిని అడ్డుకున్నారు. ఆమె లగేజీని తనిఖీ చేయగా, అడుగుభాగంలో గంజాయికి పాజిటివ్‌గా తేలిన ముద్ద రూపంలో ఆకుపచ్చని పదార్థాన్ని కలిగి ఉన్న ప్యాకెట్లు గుర్తించారు. ఈ సోదాల్లో మొత్తం 4.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 4.15 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి గంజాయి తీసుకొచ్చిన ఆ ప్రయాణికురాలిని ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం అరెస్టు చేశారు.


