
దేశంలోనే మొదటిస్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. అత్యుత్తమ పోలీసింగ్‌కు సంబంధించి ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ –2025 ర్యాంకింగ్‌లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. ఏపీ రెండో స్థానంలో ఉంది. అత్యుత్తమ పోలీసింగ్‌కు 10 మార్కుల ప్రాతిపదికన తెలంగాణ 6.48 మార్కులతో టాప్‌లో నిలవగా, 3.36 మార్కులతో పశ్చిమ బెంగాల్ అట్టడుగున నిలిచింది. పోలీస్, న్యాయవ్యవస్థ, జైళ్లశాఖ, లీగల్ ఎయిడ్ పనితీరుపై ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) 2019 నుంచి ప్రతి ఏటా నివేదిక విడుదల చేస్తోంది.
ఈ క్రమంలో తాజా రిపోర్టు మంగళవారం విడుదలైంది. అత్యుత్తమ పోలీసింగ్‌లో తొలి స్థానాన్ని దక్కించుకున్న తెలంగాణ..పోలీస్, న్యాయవ్యవస్థ, జైళ్లశాఖ, లీగల్ ఎయిడ్ తదితర అంశాలన్నీ కలిపి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. అన్ని విభాగాల్లో కలిపి గత నివేదికలో 11 స్థానంలో నిలిచిన తెలంగాణ ఈ ఏడాది మూడో స్థానానికి ఎగబాకడం గమనార్హం. కాగా అన్ని అంశాల్లో కలిపి 2025లో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో న్యాయవ్యవస్థస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, కేరళ, తమిళనాడు నిలిచినట్టు నివేదిక వెల్లడించింది.
50 శాతం పెరిగిన ఖైదీల సంఖ్య
జాతీయ స్థాయిలో పోలీస్–పౌరుల నిష్పత్తి పరిశీలిస్తే.. ప్రతి లక్ష మంది పౌరులకు 155 మంది పోలీసులు ఉన్నట్టు నివేదిక తెలిపింది. బిహార్‌లో అతి తక్కువగా ప్రతి లక్షమంది పౌరులకు 81 మంది మాత్రమే పోలీసులు ఉన్నట్టు పేర్కొంది. కాగా గత దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా జైళ్లలో ఖైదీల సంఖ్య 50 శాతం పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. ఇందులో అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య గతంతో పోలిస్తే 66 శాతం నుంచి 76 శాతానికి చేరినట్టు తెలిపింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బడ్జెట్‌లలో క్రిమినల్ జస్టిస్ సిస్టంకు ఇస్తున్న కేటాయింపులలో అత్యధిక భాగం జీతభత్యాలకే ఖర్చవుతుండగా, అతికొద్ది మొత్తం మాత్రమే మౌలిక వసతుల కేటాయింపునకు ఖర్చు చేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా పోలీస్‌శాఖలో మహిళల సంఖ్య 8 శాతం మాత్రమే ఉన్నట్టు తెలిపింది. మహిళా అధికారుల సంఖ్య 10 శాతానికే పరిమితం అయినట్టు వివరించింది. తెలంగాణ పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య 8.7 శాతం కాగా, మహిళా అధికారుల సంఖ్య 7.6 శాతంగా ఉందని ఐజేఆర్ తెలిపింది.