సైదాపురం ఖనిజ సంపద కొల్లగొడుతున్న వైనం
● అనుమతులు లేకున్నా తెల్లరాయి తరలింపు ● గత 10 రోజుల్లోనే 15,000 వేల టన్నులకు పైగా తరలింపు ● కోట్ల రూపాయల మేర వెనుకేసుకున్న తమ్ముళ్లు
● కూటమి ప్రభుత్వంలో కొత్త పాలసీ పేరిట అన్ని మైనింగ్‌ల మూత ● టీడీపీలోని మంత్రి అనుచరుడి మైనింగ్‌కు మాత్రమే అనుమతి ● పార్టీ పెద్దలకు, అధికారులకు చేరుతున్న నెలవారీ మామూళ్లు ● ఫిర్యాదు చేసినా బుట్టదాఖలు
జిల్లాలో మైనింగ్‌ల సమాచారం
● కొత్తపాలసీ ప్రకారం మూతబడిన
భూగర్భ గనులు 7
● ఓపెన్ క్వార్ట్జ్ మైనింగ్‌లు 130
● సైదాపురంలో ఉన్నవి 60
● కొత్త పాలసీ పేరిట అన్ని గనులు మూసి
ఒక గనికే అనుమతి
సాక్షి టాస్క్‌ఫోర్స్: గత ఆర్నెళ్లుగా కూటమి నేతల అవినీతి అక్రమాలు, అన్యాయాలను చూసి జనం ఈసడించుకుంటున్నారు. కనిపించిన ప్రతి చోటా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో సైదాపురం మండలం గత నెల రోజులుగా యథేచ్ఛగా తెల్లరాయిని తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు. పాలక ప్రభుత్వం మైనింగ్ అనుమతులు నిలిపేసినా టీడీపీ నేతల తెల్లరాయి అక్రమ తరలింపు దందా మాత్రం ఆగడం లేదు. మండలం నుంచి ప్రతి రోజూ 50 లారీలకు పైగా తెల్లరాయి సంపదను అక్రమ మార్గంలో తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఎవరి వాటాలు వారికి ఎప్పటికప్పుడు చేరుతుండడంతో మండలంలో ఖనిజ సంపద దందాకు అంతేలేకుండా పోతోంది.
సైదాపురం టు చైన్నె..
సైదాపురం మండలంలో 60 క్వార్ట్జ్ మైనింగ్‌లు ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తపాలసీ పేరిట అన్నీ మూసేశారు. అయితే కూటమి పార్టీ లోని మంత్రి అనుచరుడిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి మైనింగ్‌కు మాత్రమే అనుమతిచ్చారు. ఈ మైనింగ్‌లో కూడా పల్స్‌పర్ ఖనిజాన్ని మాత్రమే తరలించేందుకు అనుమతి ఉండగా.. ఈ మాటున కొందరు తెల్లరాయిని, ఇతర రాష్ట్రాల పర్మిట్లతో ఈ ప్రాంతంలో లభించే ఖనిజాన్ని మరికొందరు అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. అది కూడా సైదాపురం నుంచి రాపూరు, వెంకటగిరి, ఏర్పేడు మార్గం ద్వారా తెలుగుతమ్ముళ్లు బృందాలుగా ఏర్పడి దగ్గర ఉండి చైన్నెకి తరలిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
రాత్రివేళ లారీల్లో తరలిపోతున్న తెల్లరాయి
రోజుకు రూ.కోటి వరకు వసూలు..
అక్రమ తరలింపునకు అన్నీ తామై వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్లు ఆదాయం వింటే నోరెళ్లబెట్టాల్సిందే. టన్నుకు రూ.5 వేలు నుంచి రూ.8 వేల వరకు, ఒక్క లారీకి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు చొప్పున భారీగా వసూలు చేస్తున్నారు. రోజుకు 50 లారీలు వెళ్తే రోజూ రూ.కోటి చొప్పున ఈ వారంలోనే రూ.7 కోట్లు దండుకున్నట్లు సమాచారం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ దందాను అరికట్టి కోట్ల రూపాయల విలువ చేసే తెల్లరాయి తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని, అక్రమార్కులతో పాటు వారికి సహకరిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అనుమతి గోరంత.. అక్రమాలు కొండంత..
మండలంలో కూటమికి ముఖ్య అనుచరులకు అనుమతులు ఇచ్చారు. అయితే ఈ అనుమతులను అడ్డు పెట్టుకుని మండలంలోని జోగిపల్లి, కలిచేడు, తలుపూరు, సైదాపురం, చాగణం, ఊటుకూరు, తురిమెర్ల ప్రాంతాల నుంచి రాత్రుల్లో నిల్వ ఉన్న తెల్లరాయిని అక్రమార్కులు తరలించేస్తున్నారు. పేరుకే మైన్లు నిలిపి వేశామనే చెబుతున్నారు కానీ అన్ని గనుల్లో ఉన్న సరుకును ఇలా అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment