ఆరు నెలల్లో రోడ్డు నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో రోడ్డు నిర్మాణం

Published Sat, Nov 23 2024 7:51 AM | Last Updated on Sat, Nov 23 2024 7:51 AM

ఆరు న

ఆరు నెలల్లో రోడ్డు నిర్మాణం

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని జినుగుర్తి–అడికిచెర్ల డబుల్‌ రోడ్డు పనులు ఆరు నెలల్లోగా పూర్తి చేస్తామని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని గుండ్లమడుగుతండా వద్ద ఆగిపోయిన రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ మాట్లాడుతూ.. అటవీ శాఖ అనుమతి లేకపోవడంతో జినుగుర్తి–గుండ్లమడుగు తండా 700 మీటర్లు, గుండ్లమడుగు తండా–పెద్దేముల్‌ మండలం అడికిచెర్ల మధ్య మూడు కిలో మీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు పనుల్లో జాప్యం అవుతున్నాయన్నారు. ఇప్పటికే అటవీశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడామని త్వరలోనే అనుమతులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివరాలు సేకరించామన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ.7.45కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. అనంతరం మండల పరిధిలోని బైపాస్‌రోడ్డు పనులను కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ పరిశీలించారు. బైపాస్‌రోడ్డు పనులు ఎందుకు నిలిచిపోయానని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు

ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని పత్రాలు లేని ట్రాక్టర్లను సీజ్‌ చేస్తామని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ హెచ్చరించారు. ప్రస్తుతం తాండూరు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు మాత్రమే ఇసుక పర్మిషన్‌ ఉందన్నారు. ఇష్టానుసారంగా ఇసుక తరలింపునకు అనుమతులు ఇవ్వొద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్‌ వెంట సబ్‌–కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, ట్రెయినీ కలెక్టర్‌ ఉమాహారతి, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌, రేంజ్‌ అధికారి శ్రీదేవి, ఆర్‌అండ్‌బీ శాఖ డీఈ శివకుమార్‌, తహసీల్దార్‌ కేతావత్‌ తారాసింగ్‌ తదితరులు ఉన్నారు.

మెనూ పాటించాలి

యాలాల: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏర్పాట్లలో పరిశుభ్రత తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని అగ్గనూరు ఉన్నత పాఠశాలను తాండూరు సబ్‌–కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, ట్రైయినీ కలెక్టర్‌ ఉమా హారతితో కలిసి తనిఖీ చేశారు. భోజనానికి వినియోగించే బియ్యం నాణ్యతను పరిశీలించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఆహారం అందుతుందా లేదా అని విద్యార్థులను ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన విషయంలో ఎలాంటి ఫిర్యాదులు, సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ సుధాకర్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం వంటగది, పరిశుభ్రతను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ అంజయ్య, ఆర్‌ఐ వేణు తదితరులు ఉన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ

మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాండూరు సబ్‌–కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ తనిఖీ చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం, తేమ శాతం తదితర అంశాల విషయమై రైతులతో మాట్లాడారు. అనంతరం స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. చెన్నారం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఆయన వెంట ట్రెయినీ కలెక్టర్‌ ఉమా హారతి, తహసీల్దార్‌ అంజయ్య, ఆర్‌ఐ వేణు ఉన్నారు.

తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు

బషీరాబాద్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అన్నారు. తూకాల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోనలి కాశీంపూర్‌ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఎక్కడైన తూకాలు వేసేవారు దోపిడీ చేస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సెంటర్ల వద్ద రైతులకు కనీస వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మోహన్‌ బాబు, తహసీల్దార్‌ వై.వెంకటేష్‌, ఏపీఎం పద్మారావు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఆరు నెలల్లో రోడ్డు నిర్మాణం1
1/1

ఆరు నెలల్లో రోడ్డు నిర్మాణం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement