కొనుగోలు.. కొర్రీలు
● తేమ, తాలు పేరిట తిప్పి పంపుతున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు
● రైతన్నకు ఇబ్బందులు
● ప్రభుత్వ లక్ష్యంలో కొన్నది రెండు శాతం.. కంప్యూటరీకరణ ఒక శాతం
● దళారులను ఆశ్రయిస్తున్న రైతులు
వికారాబాద్: ఓ పక్క కొనుగోలు కేంద్రాల నిర్వహకుల కొర్రీలు.. మరో పక్క నగదు జమలో ఆలస్యం తదితర కారణాలతో రైతులకు తిప్పలు తప్పడంలేదు. వెరసి దళారులకే ధాన్యం అమ్మాల్సిన పరిస్థితి. తేమ, తాలు పేరిట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను పదే పదే తిప్పి పంపుతుండటంతో చేసేదిలేక ధాన్యం కల్లాల్లోనే పెట్టుకుని పడిగాపులుగాస్తున్నారు. చివరకు దళారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఉన్నతాధికారులు, ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ పర్యవేక్షిస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లర్లకే కొమ్ముకాస్తుండడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. పంట దిగుబడి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం గణాంకాలు చూస్తే రైతులు ఏమేరకు దళారులను ఆశ్రయిస్తున్నారో ఇట్టే తెలిసిపోతోంది. కొందరు రైతులు ధర తక్కువరైనా దళారులకే ధాన్యం విక్రయిస్తుండగా.. మరి కొందరు కొనుగోలు కేంద్రాలు, మిల్లర్ల షరతులకు తలొగ్గి వారు వేసిన తూకానికే అమ్ముతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 20 రోజులవుతున్నా ప్రభుత్వ లక్ష్యంలో రెండు శాతమే కొనుగోలు చేశారంటే పరిస్థితి అవగతమవుతోంది.
జిల్లా వ్యాప్తంగా 126 కొనుగోలు కేంద్రాలు
యాసంగితో పోలిస్తే వానాకాలం సీజన్‌లో కొనుగోలు కేంద్రాలు పెరిగాయి. 126 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 108 కేంద్రాల్లో సాధారణ రకం.. సన్నాలకు 18 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో 1.30లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు చేపట్టగా ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 2.8లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 1,05,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఏ–గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,320 చెల్లించనుండగా బీ–గ్రేడ్‌కు రూ.2,300 చెల్లిస్తున్నారు. సన్నరకం ధాన్యానానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా ఇస్తా మని ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే. అయితే కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పెడుతున్న కొర్రీలతో క్వింటాళ్‌కు రూ.1800 వరకే వస్తుండడంతో రైతులు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు.
కంప్యూటరీకరణలోనూ అలసత్వం
మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పెడుతున్న కొర్రీలతో రైతులు కల్లాల్లోనే ధాన్యం పెట్టుకుని ఆందోళనకు గురవుతూ దళారులను ఆశ్రయిస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో 2.8 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన 20 రోజుల్లో కేవలం 365 మంది రైతుల నుంచి 1717 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. వీరిలో 194 మంది రైతులకు చెందిన 926 టన్నులకు మాత్రమే ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయింది. దిగుబడిలో రెండు శాతం కొనుగోలు చేయగా పెట్టుకున్న లక్ష్యంలో ఒక శాతం మాత్రమే కంప్యూటరీకరణ పూర్తయిందంటే కొనుగోలు ప్రక్రియ నత్త నడకను తలపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment