పరిగి ఏఎంసీగా పరశురాంరెడ్డి
వైస్ చైర్మన్‌గా ఆయూబ్
పరిగి: పరిగి మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ ప్ర భుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన పర శురాంరెడ్డి, వైస్ చైర్మన్‌గా సయ్యద్ ఆయుబ్ హుస్సేన్‌తో పాటుగా 12 మంది డైరెక్టర్లతో కలసి నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చైర్మన్ అన్నారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానన్నారు.
గ్రూప్–2 అభ్యర్థులకు ఉచిత మాక్ టెస్ట్‌లు
మైనారిటీ సంక్షేమ అధికారి హనుంతరావు
అనంతగిరి: తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గ్రూప్–2 పరీక్షల్లో పాల్గొనే మైనారిటీ అభ్యర్ధుల (ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్, పార్సి మరియు బౌద్ధులు) కొరకు ఆఫ్‌లైన్‌లో ఉచిత మాక్‌టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు మైనారిటీ సంక్షేమ అధికారి హనుంతరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను నవంబర్ 29లోపు వికారాబాద్ కలెక్టరేట్‌లోని రెండవ అంతస్థులో ఉన్న ఎస్–17 మైనారిటీ కార్యాలయంలో సమర్పించాలి. వివరాలకు 9912740115 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
లగచర్లలో ఎస్పీ పర్యటన
దుద్యాల్: లగచర్ల ఘటన నేపథ్యంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు వసతి ఏర్పాటు చేసేందుకు ఎస్పీ నారాయణరెడ్డి శుక్రవారం మండలంలో పర్యటించారు. లగచర్ల పంచాయతీ కార్యాలయం, పాఠశాల, దుద్యాల్ సమీపంలోని ఆశ్రమంలో గదులను పరిశీలించారు. లగచర్ల సమస్య సద్దుమణిగే వరకూ పోలీసులు ఇక్కడే విధులు నిర్వహించేందుకు అన్ని వసతులు కల్పించేందుకే ఎస్పీ పర్యటించినట్లు సమాచారం. ఈ నెల 11న ఘటన జరిగిన అనంతరం లగచెర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంటతండాల రైతులను పరామర్శించేందుకు నిత్యం వివిధ పార్టీలు, సంఘాల నాయకులు వస్తున్న విషయం విధితమే. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు లగచెర్ల గ్రామంతో పాటు శివారులో రెండు వైపులా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. నిత్యం రెండు బ్యాచ్‌లుగా పోలీసులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్పీ నారాయణరెడ్డి లగచర్లకు వస్తున్నారనే విషయాన్ని పోలీసులు మీడియాకు తెలిపలేదు. అందుబాటులో ఉన్న కొంతమంది మీడియా ప్రతినిధులు కవరేజ్‌కు వెళ్లగా ఫొటోలు తీయొద్దని చెప్పడం గమనార్హం.
నేడు బీటీ రోడ్డు ప్రారంభోత్సవం
పూడూరు: మండల పరిధిలోని బాకాపూర్, చింతలపల్లి గ్రామాల్లో బీటీ రోడ్డు ప్రారంభించేందుకు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి విచ్చేయనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్ తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు బాకాపూర్, 12 గంటలకు చింతలపల్లి గ్రామాలకు వేసిన బీటీ రోడ్డును ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరవ్వాలన్నారు.
సీసీఐ కేంద్రాలను వినియోగించుకోవాలి
రంగారెడ్డి డీఏఓ నర్సింహారావు
చేవెళ్ల: పత్తి సాగు చేసిన రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు అన్నారు. మండల పరిధిలోని దామరగిద్ద సమీపంలో ఉన్న శ్రీనివాస కాటన్‌మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పత్తిని ఎలా కొనుగోలు చేస్తున్నారు.. ఎలా తూకం వేస్తున్నారు.. తేమశాతం ఎలా చెక్ చేస్తున్నారనే విషయాలను స్వయంగా పరిశీలించారు. రైతు లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. మద్దతు ధరలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పా రు. మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు అందుబాటులో ఉంటారని రైతులకు ఏవైనా సమస్యలుంటే వారిని సంప్రదించాలని సూచించారు. పత్తి అమ్మకానికి తెచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment