కొత్తవలస(విజయనగరం జిల్లా): ఆ కుటుంబానికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. ఆరోగ్యం, ఆర్థికంగా బాగానే ఉన్నా... ఊరు కాని ఊరు వచ్చి కుమార్తెతో కలిసి దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకోంది. పోలీసులు, స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని ఓ షిప్పింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న మహ్మద్ మొహిసుద్దీన్ (46) మర్రిపాలెం సమీపంలో ఎఫ్‌సీఐ కాలనీలో ఉంటున్నాడు. అతడికి భార్య సంషినిషా (38), కూతురు ఫాతిమా జహీదా (17), కుమారుడు మహ్మద్ ఆలీ ఉన్నారు.
అతడు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో గతంలో కొంత భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని చూసేందుకు దంపతులిద్దరూ, కుమార్తె క్యాబ్ బుక్ చేసుకొని ఇంటి నుంచి సోమవారం వచ్చారు. సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో తిరిగారు. ఇంతలో ఏమైందో గానీ ముగ్గురూ గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బావిగట్టుపై మృతుడికి చెందిన సెల్‌ఫోన్, తమ బంధువులకు సంబంధించిన ఫోన్ నంబర్లు రాసిన కాగితం, ఇతర వస్తువులు ఉండడాన్ని స్థానికులు గుర్తించారు.
బావిలోకి చూడగా మృతదేహాలు తేలియాడడం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ ఎస్.చంద్రశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ దొరికిన ఆధారాలతో ఫోన్ చేసి మృతుడు మొహిసుద్దీన్ కొడుకు మహ్మద్ ఆలీకి సమాచారం అందించారు. మృతుల కటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులను గుర్తించారు. ఆలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతురాలు జిహీదా విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొడుకు ఆలీ ఎంబీఏ చదువుతున్నాడు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ఘటనా స్థలాన్ని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు సందర్శించారు. క్లూస్ టీమ్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. మృతుల సెల్‌ఫోన్‌లను ఓపెన్ చేసి కాల్‌డేటాను సేకరిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాల్ డేటా సేకరిస్తే ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు.
ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
గోపాలపట్నం: కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో కుమార్తెతో కలిసి దంపతులిద్దరూ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో మర్రిపాలెం ఎఫ్‌సీఐ కాలనీలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం వెళ్లిన తల్లిదండ్రులు చెల్లి ఎంతకీ రాకపోవడంతో కుమారుడు మహ్మద్ ఆలీ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇంతలో ముగ్గురు మృతి చెందిన వార్త తెలియడంతో కుమారుడు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఉదయం వరకు సరదాగా ఉన్న వాళ్లు ఎందుకు ఇంత పనిచేశారంటూ గుండెలవిసేలా రోదించారు.
అప్పులే కారణమా...?
గతంలో షిప్పింగ్ కంపెనీలో పనిచేసిన మొహిసుద్దీన్ కొన్నాళ్లగా సొంతంగా కాంట్రాక్ట్ పనులు చేపడుతున్నాడు. దీంతో కొంతమేరకు అప్పుల పాలైనట్లు సమాచారం. ఆత్మహ్యతకు ఇది కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment