నామినేటెడ్‌.. ఫ్రస్ట్రేటెడ్‌ | - | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌.. ఫ్రస్ట్రేటెడ్‌

Published Thu, Sep 26 2024 2:00 AM | Last Updated on Thu, Sep 26 2024 2:00 AM

నామినేటెడ్‌.. ఫ్రస్ట్రేటెడ్‌

● నామినేటెడ్‌ పదవులు దక్కని నేతల్లో నైరాశ్యం ● పార్టీ కోసం కష్టపడిన గుర్తింపు లేదని మండిపాటు ● పార్టీ నిర్ణయంపై అసంతృప్తి
అధికార పార్టీలో అసంతృప్తుల గోల!

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

ధికారపార్టీ కూటమి నేతల్లో అసంతృప్తి మొదలైంది. మొదటి దఫా నామినేటెడ్‌ పోస్టుల్లో పదవులు దక్కని నేతలందరూ ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. పార్టీ నిర్ణయంపై మండిపడుతున్నారు. పార్టీలో మొదటి నుంచీ కష్టపడిన తమకు గుర్తింపు దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సీటు ఆశించి దక్కకపోయినా పార్టీ గెలుపు కోసం కష్టపడిన తమను గుర్తించకపోవడంపై అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. ప్రధానంగా పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు కాకుండా కొద్ది మందికి మాత్రమే పదవులు వరించడాన్ని ఆహ్వానించలేకపోతున్నారు. అటు టీడీపీతో పాటు ఇటు జనసేన పార్టీలో ప్రధానంగా ఈ అసంతృప్తులు ఎక్కువగా ఉన్నారు. సీట్ల సర్దుబాటు పేరుతో తమకు సీటు దక్కకపోయినప్పటికీ మిన్నకుండిపోయామని... కూటమి పార్టీ గెలుపు కోసం కష్టపడిన తమకు ఇచ్చే గుర్తింపు ఇదేనా అని వాపోతున్నారు.

ఇరు పార్టీల్లోనూ ఇదే లొల్లి...!

కూటమి పార్టీల్లో ప్రధానంగా టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఎక్కువగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనసేన పార్టీకి చెందిన ఏ ఒక్కరికీ కూడా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కలేదు. కేవలం టీడీపీకి చెందిన పీలా గోవింద్‌కు మాత్రమే పదవి వరించింది. దీంతో ప్రధానంగా జనసేన నేతల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్లుగా ఉండి.. ప్రతిపక్షంలో కూడా పార్టీతో పాటు ఉండి.. నియోజకవర్గంలో కలియతిరిగిన తమను గుర్తించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

● యలమంచిలి నియోజకవర్గానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు, పప్పల చలపతిరావులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

● జనసేన నుంచి భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పంచకర్ల సందీప్‌, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పసుపులేటి ఉషాకిరణ్‌లు పొత్తులో సీటును కోల్పోయారు. దీంతో వీరిద్దరూ తమకు ఏదో ఒక పదవి దక్కకపోతుందా అని ఆశించారు. ఈ జాబితాలో వీరికి మొండిచెయ్యి ఎదురైంది.

● విశాఖ దక్షిణ సీటు ఆశించి భంగపడిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి నామినేటెడ్‌ పోస్టు దక్కలేదు. పైకి ఏమీ మాట్లాడనప్పటికీ లోలోన మాత్రం ఈయన కూడా మండిపడుతున్నట్టు సమాచారం.

● పార్టీలో సీనియరు నేతలుగా ఉన్న మహమ్మద్‌ నజీర్‌, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి మాజీ కార్పొరేటర్‌ సన్యాసిరావు... గతంలో ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నించారు. టికెట్‌ రాకపోవడంతో నామినేటెడ్‌ పోస్టును ఆశించారు.

● గతంలో జీవీఎంసీ ఫ్లోర్‌ లీడరుగా పనిచేసిన పట్టాభికి కూడా నిరాశే ఎదురైంది.

● దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్‌ ఎమ్మెల్సీ పదవి లేదా ఏదైనా నామినేటెడ్‌ చైర్మన్‌ పోస్టు ఆశించారు. అతడికి మొండి చెయ్యి చూపడంతో బయటికి ఏమీ మాట్లాడకపోయినా దిగువ కేడర్‌ నుంచి తనకు పదవి ఇవ్వాలనే డిమాండ్‌ ఉంచేలా సంకేతాలు పంపిస్తున్నారు.

● మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు మరోసారి ఎమ్మెల్సీగా చేయాలని ఉంది అని సన్నిహితుల వద్ద అంటున్నాడు.

● బీజేపీ సీనియర్‌ నాయకుడు పరుచూరి భాస్కరరావు రాష్ట్ర బీజేపీ నుంచి ఏదైనా పదవి వస్తాదేమో అని ఎదురుచూస్తున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏ ఒక్క జనసేన, బీజేపీ నేతకు ఎటువంటి కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టు దక్కకపోవడం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమవుతోంది.

ఏజెన్సీలో అదే వేడి...!

ఒకవైపు వర్షాలతో సాధారణ వాతావరణం కొద్దిగా చల్లబడినప్పటికీ... రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కుతోంది. ఏజెన్సీలో మాజీ మంత్రి మణికుమారి, అరకు నుంచి టికెట్‌ ఆశించి... పోటీ నుంచి తప్పుకున్న దొన్నుదొరతో పాటు పాడేరులో సీనియర్‌ నేతలుగా ఉన్న చల్లంగి జ్ఞానేశ్వరి, ఎంవీఎస్‌ ప్రసాద్‌లతో పాటు జనసేన నుంచి పాడేరు టికెట్‌ ఆశించిన వొంపురి గంగులయ్యలకు ఎటువంటి పదవులు దక్కలేదు. వీరంతా పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీని నమ్ముకున్న తమకు ఎటువంటి పదవులు ఇవ్వకపోవడంపై మండిపడుతున్నట్టు సమాచారం. పార్టీలో మొదటి నుంచీ పనిచేసిన వారికి గుర్తింపు దక్కడం లేదని ఈ నేతలందరూ లోలోపల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ప్రకటించే నామినేటెడ్‌ పోస్టుల జాబితాలో కూడా తమకు గుర్తింపు దక్కకపోతే మాత్రం బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కేందుకు కొద్ది మంది నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement