చంద్రబాబుతో బేరం.. బీసీలకు కృష్ణయ్య ద్రోహం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో బేరం.. బీసీలకు కృష్ణయ్య ద్రోహం

Published Thu, Sep 26 2024 2:00 AM | Last Updated on Thu, Sep 26 2024 2:00 AM

చంద్రబాబుతో బేరం.. బీసీలకు కృష్ణయ్య ద్రోహం

● బీసీ గళం వినిపిస్తారని రాజ్యసభకు జగన్‌ పంపిస్తే అమ్ముడుపోయారు ● ప్రజల దృష్టి మరలించేందుకే తెరపైకి తిరుమల లడ్డూ వివాదం ● మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ధ్వజం

ఎంవీపీకాలనీ: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో బేరం పెట్టుకుని, ఆర్‌.కృష్ణయ్య బీసీలకు ద్రోహం చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బుధవారం విశాఖలోని శాసన మండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేయడాన్ని బీసీలకు చేసిన ద్రోహంగా అభివర్ణించారు. చట్టసభల్లో బీసీల గళం వినిపిస్తారన్న ఆకాంక్షతో కృష్ణయ్యను అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యసభకు పంపించారని తెలిపారు. చంద్రబాబు కొనుగోళ్లకు లొంగిన కృష్ణయ్య బీసీలకు వెన్నుపోటు పొడిచారని ఆక్షేపించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో బీసీలకే అగ్రతాంబూలం అందించారన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు ఏనాడూ.. ఒక్క బీసీని రాజ్యసభకు పంపించిన చరిత్రలేదన్నారు.

విషం చిమ్మేందుకే.. తిరుమల లడ్డూ వివాదం

వందరోజుల పాలనపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిమళ్లించడంతోపాటు, వైఎస్సార్‌సీపీపై విషం చిమ్మేందుకే చంద్రబాబు శ్రీవారి లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు అబద్ధాలు వల్లిస్తుంటే తనయుడు లోకేష్‌తో పాటు టీటీడీ ఈవో కల్తీ నెయ్యి ట్యాంకర్లను గుర్తించి వెనక్కిపంపేశాం, లడ్డూ ప్రసాదంలో ఆ నెయ్యి వినియోగించలేదని స్పష్టంగా చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నీచ రాజకీయానికి ఇది పరాకాష్ట అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, విజయవాడ వరదలు, రాష్రంలో హత్యలు, అత్యాచారలు, అమలు కాని సూపర్‌సిక్స్‌ హామీల నుంచి ప్రజల వ్యతిరేకతను పక్కదోవ పట్టించేందుకే చంద్రబాబు శ్రీవారిని రాజకీయాల్లోకి లాగారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టి, నిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టులో కేసు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement