భర్తను హత్య చేసిన మహిళ, మరో వ్యక్తికి యావజ్జీవ జైలు | - | Sakshi
Sakshi News home page

భర్తను హత్య చేసిన మహిళ, మరో వ్యక్తికి యావజ్జీవ జైలు

Published Thu, Nov 21 2024 12:56 AM | Last Updated on Thu, Nov 21 2024 12:56 AM

-

విశాఖ లీగల్‌: వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన మహిళతో పాటు మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నగరంలోని ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌ బుధవారం తీర్పు చెప్పారు. జైలు శిక్షతోపాటు నిందితులు రూ.1.50 లక్షలు జరిమానా చెల్లించాలని.. ఆ మొత్తంలో రూ.1.20 లక్షలు మృతి చెందిన వ్యక్తి పిల్లలకు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కాండ్రేగుల జగదీశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా మోదవలస గ్రామానికి చెందిన బాడిద బోయిన రాములప్పుడికి 2008లో విశాఖ జిల్లా పద్మనాభం మండలం కురుపల్లి గ్రామానికి చెందిన నరసయ్యమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన కొంతకాలం తర్వాత నరసయ్యమ్మ తన అక్క కొడుకు గండిబోయిన అప్పలరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై తరచూ రాములప్పుడు, నరసయ్యమ్మ గొడవలు పడేవారు. 2018 ఫిబ్రవరి 13న శివరాత్రి పండగకు రాములప్పుడు తన స్వగ్రామమైన మోదవలస వెళ్లాడు. భార్యా పిల్లలు కూడా వెంట ఉన్నారు. మోదవలసలో రామప్పడును చంపడానికి నరసయ్యమ్మ.. అప్పలరాజుతో కలిసి పథకం రచించింది. అప్పలరాజు తన తమ్ముడు ఎల్లారావు(ఎల్లాజీ)తో కలిసి రాములప్పడును చంపడానికి సిద్ధమయ్యాడు. రాత్రి సమయంలో రాములప్పడును కరల్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ముగ్గురూ కలిసి మృతుడిని మోదివలస నుంచి పద్మనాభం మండలం కురిపిల్లికి తెచ్చి వదిలేశారు. వెంటనే వారు మళ్లీ గ్రామానికి వెళ్లిపోయారు. తన అన్నయ్య అనుమానాస్పదంగా చనిపోయి ఉండడంతో తమ్ముడు ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆనందపురం పోలీసులు దర్యాప్తు జరిపి, నిందితులపై భారతీయ శిక్షాస్మృతి 302, 120 బి, 364 సెక్షన్ల కింద నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న గండిబోయిన ఎల్లాజీ మైనర్‌ కావడంతో వేరే న్యాయస్థానంలో కేసు దర్యాప్తు జరిగింది. ఆ బాలునికి మూడేళ్ల జైలు శిక్ష విధించి, బాలల సంరక్షణ పరివర్తన కేంద్రానికి పంపించారు. తల్లి జైలుకి వెళ్లడం, తండ్రి మృతి చెందడంతో పిల్లల సంరక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ప్రధాన న్యాయమూర్తి సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement