ఎల్‌ఐసీని నిర్వీర్యం చేసే కుట్రను తిప్పికొట్టాలి
డాబాగార్డెన్స్: ఎల్‌ఐసీలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ సోమవారం ఎల్‌ఐసీ ఏవోఐ ఆధ్వర్యంలో ఎల్‌ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టారు. ఏవోఐ డివిజన్ అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో అఖిల భారత వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీలో ఐపీవో ద్వారా షేర్లు విక్రయించి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. ఈ విధానాల వల్ల 14 లక్షల మంది ఏజెంట్ల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. డిమాండ్ల సాధనకు బ్రాంచ్‌ల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి కోటి సంతకాలతో పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు ఇవ్వాలని ఏజెంట్లకు సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న లక్షలాది మందితో చలో పార్లమెంట్ కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. ధర్నాలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికిశోర్, డివిజన్ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎన్.రవీంద్రనాథ్ ఠాగూర్, యూనియన్ గౌరవ అధ్యక్షుడు, సిటూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్, కె.త్రిమూర్తులు, ఆంజనేయులు, అబ్దుల్ సత్తార్, శ్రీరాములు, ధనుంజయ్, శ్రీనివాసరావు, నారాయణరావు, రామారావు, రమణబాబు, ఈశ్వరరావు, కావ్య, మాధవి పెద్ద ఎత్తున ఏజెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment