బాబోయ్ దోమలు
జగజ్జేతగా పేరు తెచ్చుకున్న అలెగ్జాండర్ క్రీ.పూ. 323లో దోమకాటుకు గురై మలేరియా సోకడంతో చనిపోయారు. చివరకు వీటికి భయపడి చెంఘిజ్ ఖాన్ పశ్చిమ ఐరోపాపై దండయాత్రను విరమించుకున్నారు. నగర ప్రజలకై తే వీటితో కంటి నిండా నిద్ర కరవైంది. దోమకాటుతో పిల్లల నుంచి పెద్దలు వివిధ రకాల జ్వరాల బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా నగరంలోని ఆస్పత్రులు జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. కాలువలు, మురుగునీటి గుంతల్లో దోమలు, కీటకాల బెడదతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాల్సిన జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం నిద్దరోతోంది.
● దోమల దండయాత్రలోనగరజీవి విలవిల ● తూతూ మంత్రంగా ఫాగింగ్ ● ఫలితమివ్వని చర్యలు
దోమల ప్రభావిత ప్రాంతాలు
పాత నగరంలోని ఫెర్రీరోడ్డు, థామ్సన్ స్ట్రీట్, కోటవీధి, చాగంటి వారివీధి, చిలకపేట, పద్మానగర్, రామకృష్ణానగర్, వుడ్‌యార్డ్ స్ట్రీట్, వెలంపేట, ప్రసాద్‌గార్డెన్స్, పండావీధి, అల్లిపురం, రెల్లివీధి, చెంగల్రావుపేట, జబ్బరతోట, జాలారిపేట, పెయిందొరపేట, కోడిపందాలవీధి, తాడివీధి, దిబ్బలపాలెం, శ్రీరంగపురం, వేంకటేశ్వరనగర్, రామజోగిపేట, ప్రకాశరావుపేట, డాబాగార్డెన్స్, చాకలిపేట, సింగ్ హోటల్ జంక్షన్, ఆశీల్‌మెట్ట, రామాటాకీస్‌తో పాటు అక్కయ్యపాలెం, లలితానగర్, రైల్వే న్యూకాలనీ, అబిద్‌నగర్, కేఆర్‌ఎం కాలనీ, సీతమ్మధార, నక్కవానిపాలెం, రేసపువానిపాలెం, సీతంపేట, పెదజాలారిపేట, శివాజీపాలెం, పెదవాల్తేర్, చినవాల్తేర్, కొత్త జాలారిపేట, మంగాపురం కాలనీ, అమర్‌నగర్, మద్దిలపాలెం, కంచరపాలెం, ఐటీఐ, కరాస, ఎన్‌ఏడీ.
కోటిన్నర ఖర్చు చేస్తున్నా...
జీవీఎంసీ దోమల నియంత్రణకు రూ.కోటిన్నరకు వరకు ఖర్చు చేస్తున్నట్లు చెబుతోంది. దోమల నుంచి తప్పించుకునేందుకు దోమల బిళ్లలు, ఆలౌట్ లిక్విడ్‌ల కోసం ఒక్కో కుటుంబానికి నెలకు రూ.250 చొప్పున ఖర్చు చేస్తున్నట్లు లెక్కల్లో చూపిస్తోంది. దోమల నివారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ప్రజారోగ్య విభాగం అధికారులు చెబుతున్నా దోమలను అదుపు చేయలేకపోతున్నారు. ఫలితంగా నగరంలో డెంగ్యు, మలేరియా తదితర జ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.
డాబాగార్డెన్స్: నగరంలో సాయంత్రం 6 గంటలు దాటితే ఇక ప్రజలపై దోమల దండయాత్రే ప్రారంభమవుతుంది. ఆయా వార్డులో డ్రైనేజీ కాలువలు, ఖాళీ స్థలాల్లోని మురుగునీటి గుంతల నుంచి దోమలు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, వైరల్ తదితర విషజ్వరాలకు కారణమయ్యే దోమల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో దోమలకు ఆవాసాలుగా ఆ ప్రాంతాలు మారిపోయాయి. పారిశుధ్య నిర్వహణ అంతంత మాత్రంగా ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో తప్పితే.. వార్డులో చాలా ప్రాంతాల్లో పారిశుధ్యం తాండవిస్తోంది. కాలువల్లో మురుగు పారడం లేదు. దీంతో దోమల సమస్య ఎక్కువైంది.
మొక్కుబడిగా ఫాగింగ్
దోమల నియంత్రణకు జీవీఎంసీ నిత్యం ఫాగింగ్ చేయాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోంది. గ్రేటర్ పరిధిలో కేవలం 45 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఫాగింగ్ చేస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారంలో ఒకసారైనా ఫాగింగ్ చేయాలి. చాలా ప్రాంతాల్లో ఈ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఇళ్లల్లోనూ ఫాగింగ్ చేయాల్సిన అసవరం ఉంది. కానీ ఏటా 30 శాతంలోపే ఈ పని చేస్తున్నారంటే ప్రజారోగ్య విభాగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది. తమ ప్రాంతాల్లో నెలల తరబడి పాగింగ్ చేయడం లేదంటూ ఆయా కాలనీల వాసులే చెబుతున్నారు. దోమల ఉత్పత్తి ఎక్కువగా ఉండే మురుగునీటి గుంతల్లో నూనె బంతులు విసరడం, మలాథియాన్ పిచికారీ సక్రమంగా సాగడం లేదు.
ముందు లార్వాల పనిపట్టండి
దోమల నివారణకు ఇంతలా ఖర్చు చేస్తున్న ప్రజారోగ్య విభాగం దోమల ఉత్పత్తి నిర్మూలనను విస్మరిస్తోంది. దీంతో లార్వా వృద్ధి చెందుతూ దోమలు మరింతగా వ్యాప్తి చెందుతున్నాయి. లార్వా దశ నుంచి ప్యూపా దశకు వచ్చేలోపు నాశనం చెయ్యాలి. ఈ దశ దాటిన తర్వాత దోమలుగా మారిపోతాయి. లార్వాల నాశనం కోసం గంబూషియా చేపలు కాలువల్లో విడిచిపెడుతుంటారు. కానీ ఈ తరహా చర్యలు అతి తక్కువగా జరుగుతున్నాయి.
ఆడ దోమే వ్యాధులకు మూలం
అన్ని రకాల వ్యాధుల వ్యాప్తికి ఆడ దోమలే కారణం అవుతున్నాయి. ఆడ అనాఫిలస్ దోమ మలేరియాను, ఆడ క్యూలెక్స్ దోమ పైలేరియా, మెదడువాపు, ఏడీస్ ఈజిప్టు దోమ ఎల్లో పీవర్, డెంగీ జ్వరం, చికున్ గన్యాను వ్యాపిస్తున్నాయి. మానవుల రక్తం తాగుతూ అంటు వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వీటి తొండం పొడవుగా ఉండటంతో మనుషులు, జంతువుల రక్తాన్ని సునాయాసంగా పీల్చివేస్తుంటాయి. ఆడ దోమ 3–100 రోజులు బతికితే మగదోమ 10–20 రోజులు మాత్రమే బతుకుతుంది. మగ దోమలు మానవుల రక్తం తాగడానికి వాటి తొండం సహకరించదు.
తక్షణ చర్యలు చేపడుతున్నాం..
జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్, ప్రధాన వైధ్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్ నేతృత్వంలో దోమల నియంత్రణకు పెద్ద ఎత్తున చర్యలు చేపడతున్నాం. జీవీఎంసీ అంతటా ఫాగింగ్ చేయిస్తున్నాం. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మలేరియా, డెంగు కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చర్యలు చేపడుతున్నాం. ఇప్పుడున్న దోమలు వల్ల న్యూసెన్స్ తప్పా.. మలేరియా, డెంగ్యు వంటి జ్వరాలు ప్రబలే అవకాశం లేదు. జీవీఎంసీ మలేరియా విభాగం నుంచి పర్మినెంట్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది 300 వరకు ఉంటే.. 2023 ఆగస్టు నుంచి మరో 406 మందిని తాత్కాలిక ప్రాదిపదికన తీసుకుని పనులు చేయిస్తున్నాం. –సాంబమూర్తి, బయాలజిస్ట్, జీవీఎంసీ
Comments
Please login to add a commentAdd a comment