పెందుర్తిలో దోపిడీ దొంగల బీభత్సం
● జీవీఎంసీ పంప్ ఆపరేటర్‌పై కత్తులతో దాడి ● నగదు అపహరణ ● కరకవానిపాలెం సమీపంలో ఘటన
పెందుర్తి: నగర శివారు పెందుర్తిలో మరోసారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై కరకవానిపాలెం సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ముగ్గురు దుండగులు ఓ యువకుడ్ని అడ్డగించి కత్తులతో దాడి చేశారు. అతడి వద్ద ఉన్న రూ.10 వేలు అపహరించుకుపోయారు. వివరాలివి..పెందుర్తి మండలం గవరపాలెనికి చెందిన మళ్ల జనార్దన్ జీవీఎంసీ 96వ వార్డు నీటి సరఫరా విభాగంలో పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులకు హాజరయ్యేందుకు తన ఆటోలో ఇంటి నుంచి పెందుర్తి బయలుదేరాడు. కరకవానిపాలెం రోడ్డు నుంచి జాతీయ రహదారి పైకి వస్తున్న సమయంలో ముగ్గురు దుండగులు మంకీ క్యాప్‌లు ధరించి, చేతికి గ్లౌజ్‌లు వేసుకుని కత్తులతో ఆటోను అడ్డగించారు. ఇద్దరు దుండగులు జనార్దన్‌కు చెరోవైపు కూర్చొని నగదు కోసం వెతికారు. అయితే జనార్దన్ ప్రతిఘటించడంతో క్షణాల్లో దుండగులు కత్తులతో రెండు చేతులపై దాడి చేశారు. జేబులో ఉన్న రూ.10 వేలు లాక్కున్నారు. అదే సమయంలో వెనుక కూర్చున్న వ్యక్తి జనార్దన్ వీపుపై గాయపరిచారు. ఆ తరువాత జాతీయ రహదారి మీదుగా సరిపల్లి వైపు పారిపోయారు. దాడి సమయంలో దుండుగులు పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. దాడి నుంచి కోలుకున్న బాధితుడు వెంటనే గ్రామపెద్దలకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పెందుర్తి క్రైం విభాగం పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. గాయపడిన జనార్దన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. దుండగుల కోసం నాలుగు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నట్లు క్రైం విభాగం సబ్ ఇన్‌స్పెక్టర్ సూరిబాబు తెలిపారు.
వరుస ఘటనలతో వణుకు
సరిగ్గా వారం రోజుల క్రితం పెందుర్తి మండలం పినగాడిలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇంటికి బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు ఓ మహిళను బెదిరించి రూ.5 లక్షలు, 8 తులాల బంగారం దోచుకుపోయిన సంగతి తెలిసిందే. సరిగ్గా అదే తరహాలో దారి కాసిన దుండగులు జనార్దన్‌పై దాడి చేసి దోపిడీ చేసిన తీరు క్రైం సినిమాను తలపించింది. మరోవైపు వరుసగా ఇంటి దొంగతనాలు కూడా జరుగుతుండడంతో పెందుర్తి పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment