కేజీహెచ్‌లో మహిళకు అరుదైన చికిత్స
మహారాణిపేట: కేజీహెచ్‌లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. బాధిత మహిళ కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యులను సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ అభినందించారు. ఒడిశాకు చెందిన లబ్బూరు గ్రామ నివాసి సంధ్యకు 19 ఏళ్లగా పొట్టలో గడ్డ ఉంది. నిత్యం కడుపు నొప్పితో బాధపడేది. గత నెల 20న కేజీహెచ్ గైనిక్ ఓపీలో వైద్యులకు చూపించారు. వైద్యులు స్కాన్ చేయగా పొట్టలో కణితి ఉందని నిర్థారించారు. దీంతో గైనిక్ విభాగంలో శస్త్ర చికిత్స నిర్వహించారు. పెద్ద అండాశయ కణంలో ఆపరేషన్ చేసిన రెండు రోజుల తర్వాత రోగికి జ్వరం వచ్చి బీపీ డౌన్ అయింది. వెంటనే ఐసీయూకి తరలించారు. అక్కడ డాక్టర్ల బృందం పరీక్షించారు. ఐసీయూలో నాలుగు రోజుల పాటు ఆమెకు వైద్య సేవలు అందించి తర్వాత గైనిక్ వార్డుకు తరలించారు. బాధిత మహిళ ఆరోగ్యంగా ఉండడంతో సోమవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. క్లిష్టమైన శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్య బృందాన్ని, ఐసీయూ బృందాన్ని డాక్టర్ శివానంద్ అభినందించారు. ఈ శస్త్ర చికిత్సలో ప్రొఫెసర్ డాక్టర్ ఐ.వాణి, వైద్యులు సుధా పద్మశ్రీ, కవిత, దేవి, కళ్యాణి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ వి.రవి, డీసీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ జి. మెహర్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment