అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై కలెక్టర్ సమీక్ష
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు నేపథ్యంలో అధికారులతో భేటీ
మహారాణిపేట: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ మంగళవారం సమీక్షించారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న కలెక్టర్ల సదస్సు నేపథ్యంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరేట్ మీటింగు హాలులో ఈ మేరకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్వర్ణాంధ్ర విజన్–2047, విశాఖపట్నం విజన్–2029 ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటి వరకు మొదలు పెట్టిన పనులు, వాటి తాజా స్థితి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు, దీపం పథకం–2, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, గృహ నిర్మాణాలు తదితర పథకాలపై ఆయా శాఖలవారీగా అధికారులను ఆరా తీశారు. సంబంధిత అంశాల తాజా పరిస్థితిపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, సీపీవో శ్రీనివాసరావు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment