భూములు
తెగనమ్మాల్సిందే..
భోగాపురం విమానాశ్రయానికి రహదారుల నిర్మాణ బాధ్యత వీఎంఆర్‌డీఏదే.. పైసా కూడా నిధులివ్వని కూటమి ప్రభుత్వం
బుధవారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
విశాఖ సిటీ: రాష్ట్రానికి విశాఖే ఆర్థిక రాజధాని అని గొప్పలు చెప్పే కూటమి ప్రభుత్వం.. నగరాభివృద్ధికి మాత్రం రాష్ట్ర ఖజానా నుంచి పైసా కూడా విదిల్చడం లేదు. అమరావతి నిర్మాణానికి రూ.వేల కోట్లు సమీకరణకు ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు సర్కార్.. విశాఖపై మాత్రం కనీసం సవతి ప్రేమ కూడా చూపించడం లేదు. భోగాపురంలో భారీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి భోగాపురం విమాశ్రయానికి కనెక్టివిటీని పెంచేందుకు బృహత్తర ప్రణాళికలో 15 రహదారులను ప్రతిపాదించారు. ఇప్పుడా రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పైసా కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఆ భారాన్ని వీఎంఆర్‌డీఏపైనే మోపింది. అసలే రాబడి లేక నిర్వహణ భారంతో సతమతమవుతున్న సంస్థకు పైసా ఇవ్వకుండా ఈ రహదారుల నిర్మాణ భారం మోపడం విశాఖ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
అప్పుడు యాగీ చేసి.. ఇప్పుడు భారం మోపి..
గత వెఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాల పథకంలో భాగంగా ఒక సెంటు భూములను అభివృద్ధి చేశారు. జిల్లాలో 83 ప్రాంతాల్లో 4,828 ఎకరాల్లో సెంటు భూముల లేఅవుట్లు చేశారు. ఇందులో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలను వీఎంఆర్‌డీఏకు గత ప్రభుత్వం అందించింది. దీంతో సదరు సంస్థ రూ.175 కోట్ల అంచనా వ్యయంతో ఆయా లేఅవుట్లలో రహదారులు, బోర్లు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. వీఎంఆర్‌డీఏ ఖర్చు చేసే ఈ నిధులకు గాను.. ప్రత్యామ్నాయంగా బల్క్ ల్యాండ్స్ ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఆ భూముల నుంచి నిధులు సమకూర్చడం ద్వారా వీఎంఆర్‌డీఏపై భారం మోపకుండా చర్యలు తీసుకుంది. అయినప్పటికీ అప్పట్లో కూటమి నేతలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. పేదల లేఅవుట్ల అభివృద్ధి భారం వీఎంఆర్‌డీఏపై మోపిందని నానా యాగీ చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆదాయం చూపించకుండా రహదారుల నిర్మాణ భారం మోపడం గమనార్హం.
చినముషిడివాడ, తుమ్మపాల ప్రాంతాల్లో
భూముల అమ్మకాలకు నిర్ణయం
ఆ నిధులతోనే ఎయిర్‌పోర్టుకు
15 రహదారుల అభివృద్ధి
వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో ఆమోదం
పలు ప్రాజెక్టులకు ఆమోదం
వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో
ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు
వీఎంఆర్‌డీఏ పరిధిలో కొత్తగా విలీనమైన
13 మండలాలకు బృహత్తర ప్రణాళిక రూపకల్పన.
యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు, నెల్లిమర్ల గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు (రహదారులు, కాలువల), ఇతర అభివృద్ధి
పనులకు రూ.9 కోట్లు కేటాయింపు.
రూ 200 కోట్ల వ్యయంతో కేంద్రం, వీఎంఆర్‌డీఏ 90ః10 నిష్పత్తిలో తీరం కోత నియంత్రణ ప్రాజెక్టు.
మధురవాడలో ఒలింపిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా 2.7 ఎకరాల్లో క్రీడా సముదాయ నిర్మాణం.
రుషికొండలో పీపీపీ విధానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హ్యాబిటేట్ సెంటర్ నిర్మాణం.
రుషికొండ, గంభీరాల వద్ద వాటర్ స్పోర్ట్స్ ప్రాజెక్టు.
ఫార్మా సిటీలో ప్రమాదాలు జరిగిన సమయంలో చికిత్స అందించేందుకు, అనకాపల్లి ప్రజల వైద్య సదుపాయాల కోసం అనకాపల్లి దగ్గర 7.68 ఎకరాల్లో హెల్త్ సిటీ నిర్మాణం.
అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో రూ.2.68 కోట్లతో వాణిజ్య, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం.
రీసైకిల్ (వెస్ట్ ప్లాస్టిక్ ) వినియోగించి ప్రయోగాత్మకంగా రహదారుల నిర్మాణం. దీని ద్వారా నిర్మాణ వ్యయం 5–8 శాతం ఆదా అవుతుందని అంచనా.
విశాఖ సెంట్రల్ పార్క్‌లో ప్రస్తుతమున్న మ్యూజికల్ ఫౌంటేన్‌ను 40 నెలల నిర్వహణ నిమిత్తం
రూ 1.84 కోట్లతో అంచనాలు.
2021–2022 , 2022–2023, 2023–2024 ఆర్థిక సంవత్సరాల పద్దులు ఆమోదం.
రహదారుల నిర్మాణాలకు భూముల అమ్మకాలు
భోగాపురం విమానాశ్రయానికి రహదారులను అభివృద్ధి చేసేందుకు వీఎంఆర్‌డీఏ వద్ద నిధులు లేవు. ఈ బృహత్తర ప్రణాళిక రహదారులను నిర్మించాలంటే సంస్థకు చెందిన భూములు అమ్మాల్సిందే. దీంతో ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభమైపోయింది. వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో భూముల అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చినముషిడివాడ, తుమ్మపాల ప్రాంతాల్లో ఉన్న భూములను విక్రయించి నిధులు సేకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఆ నిధులతో భోగాపురం విమానాశ్రయానికి బృహత్తర ప్రణాళికలో ప్రతిపాధించిన 15 రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment