రోడ్డుపై రోడ్డు.. దోపిడీకేదీ అడ్డు
● పెందుర్తి పరిసర ప్రాంతాల్లో బాగున్న రోడ్లపై రోడ్లు వేస్తున్న జీవీఎంసీ ● స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడితో రూ.50 లక్షల ప్రజాధనం దుర్వినియోగం
● వార్డులో చాలా కాలనీలకు
రోడ్ల సదుపాయం లేక
ప్రజల అవస్థలు
● 96వ వార్డులో ‘కూటమి’ భక్తి
చాటుకుంటున్న అధికారులు
పెందుర్తి : జీవీఎంసీ అధికారులు అభివృద్ధికి వింత భాష్యం చెబుతున్నారు. కాలనీల్లో బాగున్న రోడ్లపై రోడ్లు వేసి ఇదే అభివృద్ధి అని చూపుతున్నారు. రూ.లక్షల్లో ప్రజాధనాన్ని ఓ కూటమి ప్రజాప్రతినిధి ఇలాకాలో ‘రోడ్డు పాలు’ చేస్తున్నారు. అలా ఎలా అనుకుంటున్నారా..అయితే ఇలా జీవీఎంసీ 96వ వార్డును ఓ సారి చూద్దాం రండి..పెందుర్తి పాతూరు, పెందుర్తి రాచ్చెరువు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిస్థాయిలో ఉన్నాయి. ఏదో ఒకటి అరా తప్పా అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇటీవల జీవీఎంసీ నుంచి విడుదలైన దాదాపు రూ.50 లక్షల నిధులు ఆయా ప్రాంతాల్లోనే గుమ్మరించారు. పెందుర్తి పాతూరులో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం రూ.34 లక్షలు, రాచ్చెరువు ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం మిగిలిన సొమ్మును ధారపోశారు. అదే సమయంలో ఆయా ప్రాంతాలకు కూత వేటు దూరంలో ఉన్న పలు కాలనీలకు రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారులకు పట్టకపోవడం విడ్డూరం.
స్వామి భక్తి చాటుకున్నారా..
జీవీఎంసీ 96వ వార్డులో పదుల సంఖ్యలో ప్రధాన, చిన్నచితకా కాలనీలకు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కాలనీల వాసులు తమ ప్రాంతంలో రోడ్లు, కాలువలు నిర్మించాలని కోరుతూ అనేకసార్లు జీవీఎంసీ అధికారులకు మొర పెట్టుకున్నారు. కానీ అధికారులకు అది పట్టలేదు. కానీ ఇదే ప్రాంతంలో నివసిస్తున్న కూటమికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి మాటను అధికారులు ‘పట్టించుకున్నారు’. అవసరం లేకపోయినా పెందుర్తి పాతూరు, పెందుర్తి రాచ్చెరువు ప్రాంతాల్లో మాత్రం ఉన్న రోడ్ల మీద రోడ్లు వేసి స్వామి భక్తి చాటుకున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులకు కమీషన్లు కట్టబెట్టేందుకే ఈ వ్యవహారం నడుస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment