అన్నదాతను నట్టేట ముంచిన కూటమి
● రైతుల తరుఫున పోరాడేందుకు 13న ‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’ ● పోస్టర్ ఆవిష్కరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
ఎంవీపీకాలనీ : అన్నదాతను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. రైతన్నల తరఫున పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ నెల 13వ తేదీన అన్నదాతకు అండగా అనే కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. ర్యాలీ నిర్వహించడంతో పాటు, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నామని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను లాసన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అందించిన రైతు భరోసా కంటే ఎక్కువ ఇస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఆ ఊసే లేదన్నారు. ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమైనప్పటికి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదన్నారు. పెట్టుబడి సాయం కోసం బడ్జెట్‌లో రూ.10,700 కోట్లు కేటాయించాల్సి ఉండగా కనీస ప్రస్తావన చేయలేదన్నారు. ఈ నెల 13న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గోనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అదీప్‌రాజు, జిల్లా పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, పార్టీ నాయకులు గొలగాని శ్రీనివాస్, పేర్ల విజయచందర్, మొల్లి అప్పారావు, నడింపల్లి కృష్ణంరాజు, బోని శివరామకృష్ణ, పీతల గోవింద్, సుబ్రహ్మణ్యం, ఉమామహేశ్వరరావు, రవికుమార్, రామన్నపాత్రుడు, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment