249 రోజుల్లోనే మైలురాయి
● 55 ఎంఎంటీ సరకు నిర్వహణతో రికార్డు ● పోర్టు చైర్‌పర్సన్ ఎం.అంగముత్తు వెల్లడి
విశాఖ సిటీ: విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) 2024–25 ఆర్థిక సంవత్సరానికి 90 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) సరకు నిర్వహణ లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తూ.. 249 రోజుల్లోనే 55 ఎంఎంటీ నిర్వహించి గత చరిత్రను తిరగరాసినట్లు వీపీఏ చైర్‌పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు వెల్లడించారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో భాగస్వాముల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది పోర్ట్ అత్యధికంగా 81.09 ఎంఎంటీ సరకు నిర్వహణ చేసి పాత రికార్డులను తిరగరాసిందని తెలిపారు. ఆ రికార్డును చెరిపేసి ఈ ఏడాది నూతన మైలురాయిని సాధించేందుకు భాగస్వాముల సహకారం అవసరమన్నారు. రాష్ట్ర, జిల్లా అధికారులు, రైల్వే, కస్టమ్స్, ఎన్‌హెచ్‌ఏఐ వంటి పీఎస్‌యూల సహకారాన్ని ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలకు అనుకూలంగా మారీటైమ్ ఇండియా విజన్ 2047, ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్ ఆధారిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు వివరించారు. ఫిబ్రవరి 2025 నాటికి పూర్తయ్యే మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వాముల సూచనలను ఆహ్వానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్‌లు విశాఖలో పచ్చదనం, నగర సుందరీకరణకు పోర్ట్ చైర్‌పర్సన్, వారి బృందం చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎస్‌ఎల్ సీఎండీ హేమంత్ కత్రి, కస్టమ్స్, జీఎస్టీ ప్రధాన కమిషనర్ నరసింహ శ్రీధర్, ఐటీ చీఫ్ కమీషనర్ జి.కె.ధాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment