కూటమిలో కుంపట్లు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో కుంపట్లు

Published Thu, Feb 27 2025 1:02 AM | Last Updated on Thu, Feb 27 2025 1:01 AM

కూటమి

కూటమిలో కుంపట్లు

నేడే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ● ఉదయం 8 నుంచి ప్రారంభం ● ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులు ● జిల్లాలో 13 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ● ఓటుహక్కు వినియోగించుకోనున్న 5,529 మంది టీచర్లు
రాజకీయ రంగు పులుముకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండుగా విడిపోయిన కూటమి పార్టీలు పాకలపాటికి టీడీపీ, జనసేన మద్దతు, గాదెకు కమలం అండ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు

పోలింగ్‌కు సర్వం సిద్ధం

ప్రశాంత వాతావరణంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జిల్లాలో 13 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 2,539 మంది పురుషులు, 2,990 మహిళలు మొత్తంగా 5,529 మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వచ్చే నెల 3వ తేదీన లెక్కింపు జరగనుంది. బుధవారం ఏయూలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల ద్వారా పోలింగ్‌ మెటీరియల్స్‌ను సిబ్బందికి అందజేశారు. ఎన్నికల ఏర్పాట్లు, సామగ్రి తరలింపు ప్రక్రియలను జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని సహాయక రిటర్నింగ్‌ అధికారి బిహెచ్‌ భవానీశంకర్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు.

విశాఖ సిటీ: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి పార్టీల్లో కుంపట్లు రాజేస్తున్నాయి. పార్టీలకతీతంగా జరగాల్సిన ఎన్నికలకు రాజకీయ రంగు పులిమాయి. నిన్న మొన్నటి వరకు పొత్తుల పేరుతో హత్తుకున్న నేతలు.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ తరువాత ఒక్కసారిగా కత్తులు దూసుకుంటున్నారు. ఒక్కో పార్టీ ఒక్కో అభ్యర్థికి మద్దతుగా నిలుస్తూ ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. వాస్తవానికి ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ.. ప్రధానంగా ఇద్దరి మధ్యే పోటీ అన్న విధంగా ఈ కూటమి పార్టీలు వ్యవహరిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు పాకలపాటి రఘువర్మకు మద్దతుగా నిలవగా, బీజేపీ మాత్రం గాదె శ్రీనివాసులు నాయుడుకు అండగా ప్రచారం చేస్తోంది. వీరి మధ్య నెలకొన్న ఈ ఆధిపత్య పోరు తుది అంకానికి చేరుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఎవరి ప్రాబల్యం పనిచేసిందో బ్యాలెట్‌లో ఉపాధ్యాయుల ఓటింగ్‌ ద్వారా బాక్సుల్లో నిక్షిప్తం కానుంది.

ఆధిపత్యం కోసం పోరు

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జిల్లాలో మూడు పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. బయటకు గుంభనంగా ఉన్నప్పటికీ.. లోలోపల మాత్రం జిల్లాపై పట్టు సాధించేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత పాకలపాటి రఘువర్మకు టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవి మద్దతు ప్రకటించారు. అతని నామినేషన్‌ దాఖలు సమయంలో స్వయంగా హాజరయ్యారు. కూటమి పార్టీలన్నీ రఘువర్మకు మద్దతుగా ఉన్నాయని ప్రకటించేశారు. చిరంజీవి వ్యాఖ్యలను బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ ఖండించడం విశేషం. తాము మరో అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆ ఘటనతో కూటమి పార్టీల్లో విభేదాలు బయటపడ్డాయి.

విందు, వినోదాలతో రచ్చ

పార్టీలకతీతంగా జరగాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం టీడీపీ, జనసేన భ్రష్టు పట్టించాయి. తమ మద్దతు అభ్యర్థి పాకలపాటి రఘువర్మ విజయానికి విందు, వినోదాలతో రచ్చ చేశాయి. పాకలపాటిని గెలిపించేందుకు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగారు. ఒకరికొకరు పోటీ పడి మరీ ఉపాధ్యాయ ఓటర్లకు వరుసగా విందులు ఇచ్చారు. ఒకవైపు నేరుగా ఎమ్మెల్యేలు ఉపాధ్యాయులతో శిబిరాలు నిర్వహించారు. పాకలపాటిని గెలిపించాలని తాయిళాలు సైతం పెద్ద ఎత్తున పంచిపెట్టారు. సాధారణ ఎన్నికల తరహాలో ఉపాధ్యాయ ఎన్నికలను నిర్వహించడం పట్ల ఉపాధ్యాయులు సైతం విస్తుపోయారు. టీడీపీ, జనసేన తీరు పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఉపాధ్యాయులను ప్రలోభాలకు గురి చేసి గౌరవ ప్రదమైన ఎన్నికల్లో రాజకీయం చేయడాన్ని తప్పుబడుతున్నాయి.

పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీస్‌ సిబ్బంది

పోలింగ్‌ కేంద్రాలివే..

జిల్లాలో 13 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పెదగంట్యాడ జెడ్పీ హైస్కూల్‌, గాజువాక జెడ్పీ హైస్కూల్‌, పెందుర్తి ప్రభుత్వ హైస్కూల్‌, ఏయూ ప్రైమరీ స్కూల్‌, డాబాగార్డెన్స్‌లోని ప్రేమ యూపీ స్కూల్‌, రైల్వే న్యూకాలనీలోని కేఎన్‌ఎం హైస్కూల్‌, కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో పోలింగ్‌ జరగనుంది. అలాగే మల్కాపురంలోని జీవీఎంసీ ప్రైమరీ స్కూల్‌, గోపాలపట్నంలోని ఎస్‌వీఎల్‌ఎన్‌ జెడ్పీ హైస్కూల్‌, చంద్రంపాలెంలోని జెడ్పీ హైస్కూల్‌, పద్మనాభంలోని ఎంపీపీ స్కూల్‌, ఆనందపురంలోని ఎంపీపీ స్కూల్‌, భీమిలిలోని మహాత్మా గాంధీ యూపీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

800 మందితో బందోబస్తు

ఎన్నికల కోసం 800 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద షామియానాలు, తాగునీరు, బయోటాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఓటర్లు సులభంగా పోలింగ్‌ కేంద్రంలోకి చేరుకునే విధంగా మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు సిద్ధం చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను రికార్డు చేయనున్నారు. పోలింగ్‌ ఏజెంట్లు, సిబ్బందితో పాటు ఓటర్లు కూడా కేంద్రం లోపలికి సెల్‌ ఫోన్లు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కూటమిలో కుంపట్లు1
1/4

కూటమిలో కుంపట్లు

కూటమిలో కుంపట్లు2
2/4

కూటమిలో కుంపట్లు

కూటమిలో కుంపట్లు3
3/4

కూటమిలో కుంపట్లు

కూటమిలో కుంపట్లు4
4/4

కూటమిలో కుంపట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement