మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు అడుగులు
● సరకు రవాణాలో సరికొత్త అధ్యాయం ● నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం ● ఎంఎంఎల్‌పీ ఏర్పాటుకు ఫీజబులిటీ స్టడీ కోసం ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ● ఎంఎంఎల్‌పీని అనుసంధానించే పనుల డీపీఆర్‌కు కూడా టెండర్లు ● పార్క్ ఏర్పాటు ద్వారా 13 నుంచి 8 శాతానికి తగ్గనున్న రవాణా వ్యయం
సాక్షి, విశాఖపట్నం: లాజిస్టిక్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విశాఖను ప్రధాన కేంద్రంగా మార్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు కీలక అడుగులు పడుతున్నాయి. సరకు రవాణా వ్యయం తగ్గించడంతో పాటు ఎగుమతి, దిగుమతులు సులభతరం చేసే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ జిల్లాలో ఏర్పాటు కానుంది. 2022 ఫిబ్రవరిలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ ఎంఎంఎల్‌పీ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. అనకాపల్లి సమీపంలో దీన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాదాపు 100 ఎకరాలను కూడా కేటాయించింది. తాజాగా లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఫీజిబులిటీ స్టడీ కోసం ఎన్‌హెచ్‌ఏఐ ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలిచింది.
లాజిస్టిక్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన లాజిస్టిక్ పాలసీ 2021–26కి అనుగుణంగా ఎంఎంఎల్‌పీలని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అనకాపల్లి, మునగపాక, పరవాడ మండలాలను కలుపుతూ జాతీయ రహదారికి సమీపంలో భూమిని గుర్తించారు. వల్లూరు, సిరసపల్లి, తాడి గ్రామాల మధ్య 396 ఎకరాల భూమి ఏపీఐఐసీకి ఉంది. ఈ భూముల్లో దాదాపు 100 ఎకరాలను లాజిస్టిక్ పార్క్ కోసం నాలుగేళ్ల క్రితం కేటాయింపులు చేశారు. గతంలో ఇక్కడ విశాఖ పోర్టు ట్రస్టు ద్వారా ఎంఎంఎల్‌పీ నిర్మించాలని భావించారు. అయితే సాగరమాల ప్రాజెక్టు ద్వారా పోర్టు స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో లాజిస్టిక్ పార్కు రానుంది.
సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి టెండర్లు
ఏపీఐఐసీ సహకారంలో ఎన్‌హెచ్‌ఏఐ అనుబంధ సంస్థ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) ఈ ఎంఎంఎల్‌పీ బాధ్యతలు చేపట్టింది. లాజిస్టిక్ పార్క్ అభివృద్ధికి సంబంధించిన ఫీజబిలిటీ స్టడీతో పాటు ఈ పార్కును అనుసంధానిస్తూ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసేందుకు కూడా ఆసక్తి వ్యక్తీకరణ(ఆర్‌ఎఫ్‌పీ) టెండర్లు ఆహ్వానించింది. ఏప్రిల్ 8వ తేదీ వరకూ టెండర్లకు గడువు విధించింది. 9వ తేదీన బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత.. నిబంధనలకు అనుగుణంగా ఫీజబిలిటీ స్టడీస్‌కు సంబంధించిన పనులను అప్పగించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.
రవాణాకు కీలక కేంద్రంగా విశాఖ
ఒక ఉత్పత్తి కేంద్రంలో తయారు చేసిన వస్తువు ధర నిర్ణయించాలంటే అందులో రవాణా చార్జీలను కూడా కలుపుతారు. ప్రతి వస్తువు ధరలో 13 శాతం ఈ వ్యయంగా గణిస్తారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటైతే.. రవాణా వ్యయం తగ్గుతుంది. ఫలితంగా వస్తువు ధర కూడా తగ్గుముఖం పడుతుంది. దీని వల్ల కొనుగోలు దారులు లాభపడటమే కాకుండా అమ్మకాలు కూడా పెరిగే అవకాశాలుంటాయి. ఎంఎంఎల్‌పీ రావడం వల్ల రవాణా వ్యయం 13 శాతం నుంచి 8 శాతానికి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పార్క్‌ను జాతీయ రహదారి, రైలు, జల రవాణాతో అనుసంధానం చేస్తారు. ఇది జాతీయ రహదారికి 8 కిమీ, విశాఖ పోర్టుకు 33 కిమీ దూరంలో ఉంది. జలమార్గం ద్వారా సరకు రవాణా చేస్తే చాలా వరకూ ఖర్చు తగ్గుతుంది. విశాఖ జిల్లాలో పోర్టులతో పాటు జాతీయ రహదారి, రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉండటంతో ఈ లాజిస్టిక్ పార్కు పారిశ్రామిక తయారీ కేంద్రాలకు కీలకంగా మారనుందని భావిస్తున్నారు. ఎంఎంఎల్‌పీల్లో సరుకు నిల్వకు గో దాములు, శీతలీకరణ గిడ్డంగులు, ట్రక్కులు నిలిపే బే ఏరియా, డ్రైవర్లకు వసతులు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, కస్టమ్ క్లియరెన్సులు, బల్క్ లోడింగ్ వంటి అన్ని సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment