కేజీహెచ్‌లో శిశువుల తారుమారు
డాబాగార్డెన్స్: కేజీహెచ్ మరోసారి వార్తల్లోకెక్కింది. గైనకాలజీ వార్డులో బుధవారం ఉదయం చోటుచేసుకున్న సంఘటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇద్దరు తల్లులకు జన్మించిన శిశువులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో సిబ్బంది చేసిన తప్పిదంతో రెండు కుటుంబాలు ఆందోళనకు దిగాయి. వివరాల్లోకి వెళితే.. పరవాడ, కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు గర్భిణులు ప్రసవం కోసం ఇటీవల కేజీహెచ్‌లో చేరారు. కృష్ణా జిల్లాకు చెందిన గర్భిణి పరిస్థితి విషమంగా ఉండటంతో బుధవారం ఉదయం 7.30 గంటలకు శస్త్రచికిత్స చేశారు. ఆమెకు మగ శిశువు జన్మించాడు. సిబ్బంది ధ్రువీకరణ పత్రాల ప్రక్రియకు అంతా సిద్ధం చేసి, శిశువును తల్లికి చూపించారు. ఫొటో కూడా తీశారు. ఆ తర్వాత, ఆ శిశువును కృష్ణా జిల్లా గర్భిణీ కుటుంబ సభ్యులకు ఇవ్వవలసి ఉండగా.. సిబ్బంది నిర్లక్ష్యంతో పరవాడకు చెందిన గర్భిణీ సహాయకులకు అందజేశారు. అక్కడకు కొద్ది నిమిషాల్లోనే లేబర్ రూమ్‌లో ఉన్న పరవాడకు చెందిన గర్భిణీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆడ శిశువును సిబ్బంది కృష్ణా జిల్లా గర్భిణీ కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో గందరగోళం మొదలైంది. తమకు మగ శిశువు పుట్టాడని చెప్పి ఇప్పుడు ఆడ శిశువును ఇస్తున్నారేమిటని వారు ప్రశ్నించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఉదయం 7.30 గంటలకు జరిగిన ఈ ఘటనను తొలుత సిబ్బంది దాచి పెట్టే ప్రయత్నం చేశారు. అయితే బాధితులు ఆందోళన చేయడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సెలవులో ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ వెంటనే ఆస్పత్రికి చేరుకుని సిబ్బందిపై మండిపడ్డారు. ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆయన నిర్ధారించారు. ఇరువర్గాలను పిలిచి సమస్యను పరిష్కరించారు. కాగా..కేజీహెచ్‌లో సిబ్బంది శిశువులను మార్పిడి చేయడంలో ఆరి తేరారని, డబ్బుల కోసం వేధిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రసవం అయినా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఆపరేషన్ థియేటర్‌లో శిశువులను మార్చినా ఎవరికీ తెలియదని పలువురు గర్భిణులు, వారి సహాయకులు వాపోతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిబ్బంది నిర్లక్ష్యంతో ఇరువర్గాల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment