సాగరతీరం.. శివనామ స్మరణం
ఏయూక్యాంపస్: సాగరతీరం శివ పంచాక్షరి మంత్రంతో మార్మోగింది. డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్.కె.బీచ్ వద్ద నిర్వహించిన 40వ మహా కుంభాభిషేకం నేత్రపర్వంగా సాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నగరవాసులు హాజరై.. తమ స్వహస్తాలతో శివయ్యకు అభిషేకాలు చేశారు. మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి(టీఎస్సార్) ప్రయాగరాజ్ నుంచి తెప్పించిన పవిత్ర జలాలతో శివలింగాలకు అభిషేకాలు జరిపించారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పళ్ల రసాలతో భక్తులే స్వయంగా అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం శివపార్వతుల కల్యాణం, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మహా కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించిన ప్రాంగణం ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో నగరవాసులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివలింగాల వద్ద భక్తులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. నిత్యం సందర్శకులు, పర్యాటకులతో అలరించే సాగరతీరం.. పూర్తి భిన్నంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment