
మరణించి.. ఐదుగురి జీవితాల్లో వెలుగునిచ్చి..
మహారాణిపేట: మరణించి కూడా ఆ యువకుడు ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. చేతికి అంది వస్తాడనుకున్న బిడ్డ బ్రెయిన్ డెడ్ అవడంతో పుట్టెడు దుఃఖంలో కూడా ఆ కుటుంబం వేరే కుటుంబాల్లో ఆనందం నింపేందుకు నిర్ణయించింది. వివరాలివి.. ఒడిశాలోని సోనాబేడలో ఉంటున్న ఆశిష్ చౌల్ సింగ్(22) ఈ నెల 2న బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో సోమవారం బ్రెయిన్ డెడ్‌గా వైద్య బృందం ప్రకటించింది. ఆ తర్వాత అవయవదానంపై వైద్య బృందం యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులకు అవగాహన కల్పించడంతో వారు అంగీకారించారు. దీంతో విషయాన్ని జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు దృష్టికి తీసుకెళ్లారు. యువకుడి నుంచి అవయవాలు సేకరించేందుకు ఆయన అనుమతులు జారీ చేశారు. దీంతో 2 కిడ్నీలు, లివర్, పాంక్రియాస్, స్మాల్ బౌల్ తీశారు. వాటిని జీవన్ దాన్ ప్రొటోకాల్ ప్రకారం సీనియార్టీ ఆధారంగా అర్హులకు కేటాయించారు. అవయవ దానంపై అవగాహన కల్పించిన వైద్య బృందానికి, అంగీకరించిన కుటుంబ సభ్యులను రాంబాబు అభినందించారు.