
24 నుంచి తొలి విడత చందనం అరగదీత
సింహాచలం: ఈ నెల 24 నుంచి సింహగిరిపై తొలి విడత చందనం అరగదీత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఇన్‌చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. ఈ నెల 30న చందనోత్సవంనాడు నిజరూప దర్శనం అనంతరం తిరిగి స్వామికి మూడు మణుగు(125 కిలో)ల పచ్చి చందనాన్ని సమర్పించనున్నారు. దీనిలో భాగంగా 24న ఉదయం 6.30కు తొలిచందనం చెక్కకు పూజలు నిర్వహించి, అరగదీతను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తామన్నారు. ఆ రోజు ఉదయం 7.30 నుంచి దర్శనాలు మొదలవుతాయని పేర్కొన్నారు. సంవత్సరంలో 364 రోజులపాటు చందనంలో ఉండి దర్శనమిచ్చే స్వామి, వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తాడు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించి, నిత్యరూపభరితున్ని చేస్తారు. మళ్లీ వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడేసి మణుగుల చందనాన్ని సమర్పిస్తారు.