విద్యుత్ శాఖకు.. బకాయిల గుదిబండ!
విద్యుత్ శాఖకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.కోట్లలో మొండి బకాయిలు వసూలు కావాల్సి ఉంది. సామాన్యులు ఒక నెల విద్యుత్ బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేసే ఆ శాఖాధికారులు రూ.కోట్లలో బకాయి పడిన ప్రభుత్వ శాఖల జోలికి వెళ్లలేరు. ఎందుకంటే అవి ప్రభుత్వ శాఖలు. దీంతో రూ.కోట్ల మొండి బకాయిలు విద్యుత్ శాఖకు గుది బండగా మారాయి.
విద్యుత్ భవన్
● రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు
● ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన మొత్తం రూ.57.51కోట్లు
● అత్యధికంగా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ నుంచి రూ.34.84 కోట్ల బకాయి
● వైద్య ఆరోగ్య శాఖ బకాయిలు రూ.5.55 కోట్లు
● మున్సిపల్ శాఖ బకాయి రూ.6.76 కోట్లు
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ శాఖకు మొండి బకాయిలు గుదిబండగా మారాయి. వివిధ ప్రభుత్వ శాఖలు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇది ఆ శాఖకు గుది బండగా తయారైంది. బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు ఆయా శాఖలకు ప్రతి నెలా లేఖలు రాయడం తప్ప బకాయిలు వసూలు కావడం లేదు. ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ శాఖకు అధికంగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏదైనా గృహ వినియోగదారు బిల్లు చెల్లించడం నాలుగైదు రోజులు ఆలస్యమైతే విద్యుత్ సిబ్బంది వారి ఫీజులు కట్ చేస్తారు. కానీ రూ.కోట్ల బకాయిలున్న వాటిని వసూలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ శాఖల నుంచి
రూ.57.51 కోట్లు బకాయి
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ శాఖకు రూ.57.51 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ వారు రూ.34.84 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ వారు రూ.5.55 కోట్లు, మున్సిపల్ శాఖ రూ.6.76 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ శాఖ రూ.4.20 కోట్లు చెల్లించాల్సి ఉంది.
లేఖలు రాస్తాం..
విద్యుత్ శాఖకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయా శాఖలకు లేఖలు రాస్తాం. వారికి బడ్జెట్ వచ్చినపుడు బకాయిలు చెల్లిస్తుంటారు.
– మువ్వల లక్ష్మణరావు, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్
విద్యుత్ శాఖకు.. బకాయిల గుదిబండ!
Comments
Please login to add a commentAdd a comment