
వాలీబాల్ పోటీల విజేత ఎస్.కోట
కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి గ్రామ సమీపంలో గల శారడ మెటల్స్ అండ్ ఎల్లోయిస్ లిమిటెడ్ కర్మాగారం సహకారంతో జిల్లా వాలీబాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో భారత్ డిఫెన్స్ అకాడమి గ్రౌండ్‌లో జరుగుతున్న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో శృంగవరపుకోట నియోజకవర్గం జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. రెండు రోజులుగా సాగుతున్న ఈ పోటీల్లో ఫైనల్ మ్యాచ్ శనివారం జరిగింది. ఫైనల్‌లో పార్వతీపురం జట్టుపై ఎస్.కోట జట్టు విజయం సాధించింది. పార్వతీపురం, కురుపాం, విజయనగరం జట్లు వరుసగా ద్వితీయ, తృతీయ, నాల్గో స్థానాల్లో నిలిచాయి. ప్రథమ, ద్వితీయ విజేతలకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చేతుల మీదుగా వరుసగా రూ.1,25,000లు, రూ.60వేలు నగదు బహుమతితో పాటు మెమోంటోలు అందజేశారు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.30వేలు, 25వేలు చొప్పున నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. శారడ కర్మాగార యాజమాన్యం క్రీడాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం కర్మాగార ప్రతినిధులు సనత్‌కుమార్, ప్రభాత్‌మోహన్ మాట్లాడుతూ శారడ కర్మాగారం సహకారంతో జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అందుకు తమ వంతు సహకారం పూర్తి స్థాయిలో అందజేస్తామన్నారు. పోటీలను జాతీయ వాలీబాల్ కోచ్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గవర సూరిబాబు, స్కూల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.కృష్ణంరాజు నిర్వహించారు. కార్యక్రమంలో భారత్ డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ కడారి రాజు, శారద కర్మాగార ప్రతినిధులు అశోక్‌కుమార్, చౌదరి, మూర్తి, హెచ్.సన్యాసిరావు, జి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్కంఠభరితంగా సాగిన పోటీలు
ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొన్న 9 జట్లు
Comments
Please login to add a commentAdd a comment