
చిచ్చు రేపిన డీలర్ ఉద్యోగం
నెల్లిమర్ల రూరల్: ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణ చినికిచినికి గాలివానలా మారి అది కాస్తా కొట్లాటకు దారి తీసింది. దీంతో గ్రామంలో ఏం జరుగుతోందో తెలియక ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. అసలు తగాదాలకు చోటే లేని గ్రామంలో రాజకీయ అశాంతి నెలకొనడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని పెద్ద బూరాడపేట గ్రామంలో టీడీపీకి చెందిన రేకపాటి వెంకట పాపారావు కుటుంబసభ్యులు గత 40 ఏళ్లగా రేషన్ షాపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల రేషన్ షాపు డీలర్ పోస్ట్‌కు నోటిఫికేషన్ ఇవ్వడంతో జనసేన నాయకుడు మక్కువ హరి సతీమణి కుమారిని డీలర్‌గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండలానికి చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రామంలో ‘గుడ్ మార్నింగ్ జనసేన’ కార్యక్రమం పేరిట ఆదివారం పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మరీ గ్రామంలోని రచ్చబండ వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన జనసేన నాయకులను డీలర్ పోస్ట్ విషయమై టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి డీలర్‌గా తమ పార్టీకి చెందినవారే వ్యవహరిస్తున్నారని తమను కాదని నిన్నమొన్న వచ్చిన జనసేన నాయకుడికి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. దీంతో తాము ఏది చెబితే అదే జరుగుతుందని జనసేన నాయకులు బదులివ్వడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. క్షణాల్లో ఒకరిపై ఒకరు చేయి చేసుకుని కొట్లాడుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త మక్కువ సత్యం అప్పలరాజు చేయి విరిగిపోవడంతో నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అసలు జనసేన ఉనికి లేకపోయినప్పటికీ ఎంతో శ్రమించి పార్టీ విజయనాకి సహకరించామని తమపై దాడికి పాల్పడి మనోభావాలు దెబ్బతీశారంటూ టీడీపీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెనుగులాటలో పలువురు టీడీపీ, జనసేన కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు.
పోలీస్ పికెట్ ఏర్పాటు
గ్రామంలో శాంతి భధ్రతలకు విఘాతం కలగడంతో స్థానిక ఎస్సై గణేష్ హుటాహుటిన గ్రామానికి వెళ్లారు. సీఐ రామకృష్ణ గ్రామాన్ని సాయంత్రం సందర్శించారు. స్థానికులతో మాట్లాడి తగాదాకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. కాగా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో చర్చలు కొనసాగుతున్నాయి.
జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య కొట్లాట
ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులు

చిచ్చు రేపిన డీలర్ ఉద్యోగం

చిచ్చు రేపిన డీలర్ ఉద్యోగం
Comments
Please login to add a commentAdd a comment