విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
విశాఖ–లీగల్: విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బెవర సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని విశాఖ న్యాయవాదుల సంఘం ఆవరణలో ఆరు జిల్లాల న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో న్యాయవాదులందరూ విశాఖకు హైకోర్టు బెంచ్, కేంద్ర పారిశ్రామిక ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందడుగు వేయాలని నిర్ణయించారు. శ్రీకాకుళం, పార్వతీపురం వంటి సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్లాలంటే చాలా భారంగా ఉందని న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే విశాఖ అన్ని రకాలుగా మోసానికి గురైందని వెల్లడించారు. అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తున్న విశాఖకు హైకోర్టు బెంచ్ కేటాయించడం అన్ని విధాల శ్రేయోదాయకమన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.నరసింహారావు మాట్లాడుతూ విశాఖలో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి న్యాయశాఖకు అభ్యంతరాలు ఉండకపోవచ్చన్నారు. 1993లో హైకోర్టుమెంట్ సాధనకు న్యాయవాదులు చేసిన ఉద్యమాలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో ప్రజల భాగస్వామ్యంతో పోరాడతామన్నారు. సోమవారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి న్యాయస్థానానికి హాజరవుతామని వివరించారు. సీనియర్ న్యాయవాది లక్ష్మీరాంబాబు, బార్ కౌన్సిల్ ఉపా ధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, ఏవీ పార్వతీశం, కృష్ణశేఖర్, పూర్వ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు, పాలకొండ, బొబ్బిలి, రాజాం, గజపతినగరం, అనకాపల్లి, చోడవరం, తుని, యలమంచిలి, విజయనగరం, ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో న్యాయవాదులు సదస్సులో పాల్గొన్నారు. న్యాయవాద సంఘం కార్యదర్శి డి.నరేష్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
Comments
Please login to add a commentAdd a comment