విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఓపెనింగ్ స్థాయి చదరంగం పోటీలకు అనూహ్యస్పందన లభించింది. భోగేశ్వరరావు–ఝాన్సీరాణి మెమోరియల్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు స్థానిక రింగ్‌రోడ్డులో ఉన్న ఫైర్ చెస్ స్కూల్‌లో ఆంధ్రా చెస్ అసోసియేషన్ సీఈఓ కేవీ. జ్వాలాముఖి పర్యవేక్షణలో జరిగాయి. ఈ పోటీలలో ఐదు జిల్లాల నుంచి దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా జె. నాగరాజు, బి.శ్రావ్యశ్రీ, బి.సాకేత్ నిలిచారు. వారికి నిర్వాహకులు నగదు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫైర్ చెస్ స్కూల్ సిబ్బంది పి. అర్చన, ఎన్.పద్మ, ఎ.దామోదర రావు పాల్గొన్నారు.
నాలుగు ఆవుల అపహరణ
దత్తిరాజేరు: మండలంలోని తాడెందొరవలస కళ్లాల్లో ఉన్న నాలుగు ఆవులను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం తెల్లవారు జామున అపహరించినట్లు సర్పంచ్ పూడి తిరుపతిరావు తెలిపారు. గ్రామంలోని సుంకరి గోవిందమ్మకు చెందిన మూడు ఆవులు, తమటాడ రాముకు చెందిన ఒక ఆవును గుర్తు బొలెరో వ్యాన్‌లో వచ్చి తరలించుకుని వెళ్లి పోయినట్లు అక్కడ అడుగులను బట్టి తెలుస్తోందని ఈ విషయమై ఎస్ బూర్జవలస పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించినట్లు సర్పంచ్ చెప్పారు.
సారా స్థావరాలపై దాడులు
● 60 లీటర్ల సారా, 95 ప్యాకెట్లు స్వాధీనం
పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణంలోని పాత రెల్లివీధిలో ముందస్తు సమాచారం మేరకు సారా స్థావరాలపై పట్టణ సీఐ కె.మురళీధర్ ఆదేశాల మేరకు సిబ్బంది దాడులు నిర్వహించారు. పాత రెల్లివీధిలో రెండుచోట్ల దాడులు నిర్వహించగా కోలబుట్టమ్మ అనే మహిళ ఇంట్లో 60లీటర్ల సారా అలాగే కోల రవికుమార్ అనే వ్యక్తి ఇంట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న 95 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా సారా తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment