
జాగరణకు వేళాయె..!
రామతీర్థంలో ఏర్పాట్ల పరిశీలన
భక్తులకు ఇబ్బందులు
కలగకుండా...
జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. కూలో ఉండే చిన్నపిల్లలకు పాలు, భక్తులకు మంచినీరు సరఫరా చేస్తాం. ప్రసాదం కౌంటర్ వద్ద భక్తుల రద్దీ దష్ట్యా బారికేడ్లను ఏర్పాటు చేశాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి వీఐపీ పాస్‌లు జారీ చేయలేదు. జాతర విజయవంతానికి అన్ని శాఖల సహకారం కోరాం. బోడికొండపైకి వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించి దేవస్థానానికి సహకరించాలి.
– శ్రీనివాసరావు, ఈఓ, రామతీర్థం దేవస్థానం
ప్రత్యేక ఆకర్షణగా పర్వతంపై శిఖరదీపం
శివరాత్రి పర్వదినాన తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలేశ్వరుని పర్వతంపై మూడు రోజుల పాటు ఏ విధంగా శిఖరజ్యోతిని వెలిగిస్తారో..రామతీర్థం బోడికొండపై కూడా గడిచిన ఐదేళ్ల నుంచి శిఖర జ్యోతిని వెలిగిస్తున్నారు. ఏటా శిఖర జ్యోతి ప్రజ్వలన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శిఖరజ్యోతిని వెలిగించేందుకు అవసరమైన వనరులను మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తమ సొంత నిధులతో సమకూర్చారు. బుధవారం రాత్రి 7గంటల సమయంలో ప్రత్యేక పూజల నడుమ శిఖర జ్యోతిని వెలిగిస్తారు.
నెల్లిమర్ల రూరల్:
ఉత్తరాంధ్రలో అతి పెద్ద పుణ్యక్షేత్రం రామతీర్థం. మూడు జిల్లాల భక్తుల అపార నమ్మకం రామక్షేత్రం. వైష్ణవ దేవాలయంగా ప్రసిద్ధికెక్కినా ప్రతి ఏటా జరుగుతున్న శివరాత్రి జాతరే రామక్షేత్రానికి ప్రత్యేకం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరుగుతున్నప్పటికీ హాజరైన భక్తుల సంఖ్య అంతంత మాత్రమే. కానీ శివరాత్రికి రెండు రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాలకు మాత్రం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా రామక్షేత్రానికి విచ్చేస్తారు. తొలి రోజు రాత్రంతా స్వామివారి క్షేత్రంలో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో జాగరం ఉంటారు. మరుసటి రోజు ఉదయం రామకోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ముందుగా శ్రీరాముడిని అనంతరం క్షేత్ర పాలకుడైన ఉమాసదాశివ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
దేవాదాయ శాఖ ఏర్పాట్లు
భక్తులకు రామతీర్థం ఆలయంలో ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం రూ.50, అలాగే ఉమాసదాశివ ఆలయంలో ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం రూ.50గా కల్పిస్తున్నారు. భక్తుల కోసం 25వేల లడ్డూ ప్యాకెట్లు, పులిహోర ప్రసాదాన్ని సిద్ధం చేశారు. అలాగే ఎండ తీవ్రతను దష్టిలో పెట్టుకుని చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. క్యూలలో తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే దేవస్థానానికి విద్యుత్ వెలుగుల అలంకరణ పూర్తయింది. శివాలయం, ప్రధాన ఆలయంతో పాటు బోడికొండ మెట్ల మార్గంలోనూ ట్యూబ్‌లైట్లను ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్‌వద్ద స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేశఖండన శాల వద్ద తోపులాట జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. కొండవెలగాడ, సతివాడ పీహెచ్‌సీల ఆధ్వర్యంలో వైద్యసేవలు అందించనున్నారు.
రామతీర్థానికి ఇలా చేరుకోవాలి
జిల్లా కేంద్రం విజయనగరానికి 13కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉండగా నెల్లిమర్లకు తూర్పుదిక్కున ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరం–శ్రీకాకుళం వయా నెల్లిమర్ల రహదారిలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి విజయనగరం కోట నుంచి నేరుగా ప్రై వేట్ వాహనాలు ఉంటాయి. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చిన భక్తులు రణస్థలం మార్కెట్ వద్ద దిగి సతివాడ–నెల్లిమర్ల వాహనాలను ఆశ్రయించవచ్చు. రణస్థలం నుంచి రామతీర్థం 18కిలోమీటర్ల దూరం వస్తుంది. జాతర సందర్భంగా విజయనగరం, రణస్థలం నుంచి ప్రతి పది నిముషాలకు ఒక బస్సు ప్రయాణికులకు సేవలందిస్తుంది.
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. రామతీర్థంలో బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ అధికారులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ముందుగా సీతారామస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతరకు సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. విజయనగరం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు కల్యాణ మంటపం ప్రాంగణంలో, శ్రీకాకుళం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు ప్రాథమిక పాఠశాల వద్ద పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ద్విచక్రవాహనాలు, కార్ల పార్కింగ్ కోసం సీతారామునిపేట, దన్నానపేట జంక్షన్‌ల వద్ద ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రామాలయం, శివాలయంతో పాటు రామకోనేరు, ప్రసాదాల పంపిణీ కేంద్రాల వద్ద మూవింగ్ పార్టీలుగా బందోబస్తును విభజించామని, అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, దొంగతనాలు, ఈవ్‌టిజింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మఫ్టీలో సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణ, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, ఎస్‌ఐ గణేష్, ఈఓ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

జాగరణకు వేళాయె..!

జాగరణకు వేళాయె..!

జాగరణకు వేళాయె..!
Comments
Please login to add a commentAdd a comment